ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్... ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన హై డ్రామా... ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు చేయలేక ఓడిన గుజరాత్ టైటాన్స్...
ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత విజయాల బాట పట్టింది ముంబై ఇండియన్స్. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది ముంబై ఇండియన్స్... సీజన్‌లో ముంబైకి ఇది రెండో విజయం కాగా, గుజరాత్ టైటాన్స్‌కి వరుసగా రెండో ఓటమి...
178 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కి అదిరిపోయే ఆరంభం దక్కింది. సీజన్ ఆరంభంలో రెండు 80+ స్కోర్లు చేసి, ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తున్న శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాతో కలిసి తొలి వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...
గుజరాత్ టైటాన్స్‌కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని అవుట్ చేసిన మురుగన్ అశ్విన్, అదే ఓవర్‌లో మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహాని కూడా పెవిలియన్ చేర్చాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన సాహా, ముంబై ఇండియన్స్‌పై ఐదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు..
11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్, పోలార్డ్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ చేతుల్లో నుంచి జారిన బ్యాటు, వికెట్లను గిరాటేసింది... ఈ సీజన్‌లో హిట్ వికెట్‌గా అవుటైన మొదటి బ్యాటర్ సాయి సుదర్శన్ కాగా ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో 14వ బ్యాటర్...
విజయానికి 15 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన దశలో హార్ధిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు. 14 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పాండ్యా. ఆఖరి 2 ఓవర్లలో 20 పరుగులు కావాల్సిన దశలో బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో 9 పరుగులే కావాల్సి వచ్చాయి.
డానియల్ సామ్స్ వేసిన 20వ ఓవర్‌లో తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీయగా, రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి రాహుల్ తెవాటియా రనౌట్ అయ్యాడు. దీంతో టైటాన్స్ విజయానికి ఆఖరి 3 బంతుల్లో 7 పరుగులు కావాల్సి రావడంతో ఉత్కంఠ రేగింది...
ఆ తర్వాతి బంతికి రషీద్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ని డానియల్ సామ్స్ ఒడిసిపట్టలేకపోయాడు. దీంతో ఆఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి వచ్చాయి. ఐదో బంతికి పరుగులేమీ రాలేదు. ఆఖరి బంతిని కూడా డిఫెండ్ చేసిన సామ్స్, ముంబైకి 5 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగుల స్కోరు చేసింది. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న గుజరాత్‌కి అనుకూలంగా ఫలితం వచ్చింది...
11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
డేంజరస్ బ్యాట్స్‌మెన్ కిరన్ పోలార్డ్ 14 బంతులు ఆడినా 4 పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్...16 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ, రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు...
లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో డీఆర్‌ఎస్ తీసుకున్నా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డానియల్ సామ్స్, ఆ తర్వాతి బంతికే రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్, ఫీల్డర్‌గా మూడు క్యాచులు అందుకోవడం విశేషం.
