ఐపీఎల్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్... 48 పరుగులతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఇషాన్ కిషన్, ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్...
ఐపీఎల్ 2022 సీజన్ ఓపెనింగ్ మ్యాచులో మెరుపులు చూసే అవకాశం దక్కకపోయినా, రెండో మ్యాచ్‌లో సిక్సర్ల మోత కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై ఇండియన్స్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ...
32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన రోహిత్ శర్మ, కుల్దీప్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అన్‌మోల్‌ప్రీత్ సింగ్ 9 బంతుల్లో 8 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
టూ డౌన్‌లో వచ్చిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడి... ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ కిరన్ పోలార్డ్ 6 బంతుల్లో 3 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్‌లోనే అవుట్ అయ్యాడు...
4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్ యాదవ్, 3 వికెట్లు పడగొట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు దూకుడు కొనసాగించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్, ఐపీఎల్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. గత సీజన్‌లో ఆడిన ఆఖరి రెండు మ్యాచుల్లో 50+ స్కోర్లు చేశాడు ఇషాన్ కిషన్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వికెట్ కీపర్ బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. మొదటి మ్యాచ్‌లో సీఎస్‌కే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే...
సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ కాగా... శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టాడు ఇషాన్ కిషన్. 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఇషాన్ కిషన్, తన స్టైల్‌లో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. డానియల్ సామ్స్ 2 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...
ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించి తీవ్రంగా నిరాశపరిచాడు. బ్రాబోన్ స్టేడియంలో గత 12 మ్యాచుల్లో 177, అంతకుమించి పరుగుల స్కోరు నమోదుకావడం ఇది 8వసారి. 8లో 6 మ్యాచుల్లో లక్ష్యాన్ని కాపాడుకుంటూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయాన్ని అందుకున్నాయి.
