కెఎల్ రాహుల్ డైమండ్ డకౌట్... క్వింటన్ డి కాక్ హాఫ్ సెంచరీ... దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్ మెరుపులు... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ముందు భారీ లక్ష్యం...
ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్ బౌలర్ శివమ్ మావి మరోసారి టార్గెట్ అయ్యాడు. గత సీజన్‌లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా, శివమ్ మావి వేసిన మొదటి ఓవర్‌లో 6 సిక్సర్లతో 24 పరుగులు రాబడితే, ఈసారి లక్నో బ్యాటర్లు స్టోయినిస్, జాసన్ హోల్డర్ కలిసి 5 సిక్సర్లతో 30 పరుగులతో మావిని ఉతికి ఆరేశారు... ఫలితంగా 150 కూడా దాటుతుందో లేదు అనుకున్న లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది...
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్‌కి శుభారంభం దక్కలేదు. మొదటి ఓవర్‌లోనే కెఎల్ రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే డైమండ్ డకౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. కేకేఆర్ కెప్టెన్ సూపర్ త్రోకి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ డైమండ్ డకౌట్ అయ్యాడు.
ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా రెండో స్థానంలో నిలిచాడు కెఎల్ రాహుల్... ఇంతకుముందు 2012లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్భజన్ సింగ్, 2014లో కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్, 2014లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 2018లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, 2018లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే సీజన్‌లో మూడు సార్లు డకౌట్ అయ్యారు...
2013 నుంచి 2021 వరకూ ఐపీఎల్ ఒకే ఒక్క డకౌట్ అయిన కెఎల్ రాహుల్, ఈ సీజన్‌లో ఏకంగా మూడు సార్లు డకౌట్ కావడం విశేషం. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినా క్వింటన్ డి కాక్, దీపక్ హుడా కలిసి రెండో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లక్నోని ఆదుకున్నారు.
29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్ బౌలింగ్‌లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన దీపక్ హుడా.. ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
27 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా కూడా రస్సెల్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 13 ఓవర్లలోనే 110 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్, ఆ తర్వాత స్కోరు వేగాన్ని తగ్గించింది. 18 ఓవర్లు ముగిసే సమయానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది...
అయితే 19వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన మార్కస్ స్టోయినిస్, ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు స్టోయినిస్. వస్తూనే జాసన్ హోల్డర్ రెండు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి...
ఆఖరి ఓవర్‌లో టిమ్ సౌథీ 4 పరుగులు మాత్రమే ఇచ్చి జాసన్ హోల్డర్‌ని అవుట్ చేయగా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఛమీరా రనౌట్ అయ్యాడు.ఆఖరి 5 ఓవర్లలో 53 పరుగులు రాగా 19వ ఓవర్‌లోనే 30 పరుగులు రావడం విశేషం.
