కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... 42 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, 3 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్...
ఢిల్లీ క్యాపిటల్స్‌పై రివెంజ్ తీర్చుకోవాలనే శ్రేయాస్ అయ్యర్ కోరిక రెండోసారి కూడా నెరవేరలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది కేకేఆర్. 9 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచుల్లో ఐదింట్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది...
147 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో వార్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్న ఐపీఎల్ ఫ్యాన్స్‌కి కేకేఆర్ బౌలర్ల అద్భుత పోరాటం కారణంగా థ్రిల్లర్ మ్యాచ్‌ని చూసే అవకాశం దక్కింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే పృథ్వీ షాని అవుట్ చేసి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు ఉమేశ్ యాదవ్...
పృథ్వీ షా బ్యాటు అంచును తాకి తనవైపు దూసుకొచ్చిన బంతిని డైవ్ చేసి అందుకున్నాడు ఉమేశ్ యాదవ్. 7 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, హర్షిత్ రాణా బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
ఈ దశలో లలిత్ యాదవ్, డేవిడ్ వార్నర్ కలిసి మూడో వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 26 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేసి డేవిడ్ వార్నర్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఐపీఎల్‌లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ అవుట్ కావడం డేవిడ్ వార్నర్‌కి ఇది ఐదో సారి. ఐపీఎల్‌లో వార్నర్‌ని ఎక్కువ సార్లు అవుట్ చేసిన బౌలర్ ఉమేశ్ యాదవ్...
29 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన లలిత్ యాదవ్‌ను అవుట్ చేసి ఐపీఎల్ కెరీర్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు సునీల్ నరైన్. 5 బంతుల్లో 2 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఇంద్రజిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
ఒకానొక దశలో 82/2 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ, 1 1 బంతుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి 84/5 స్కోరుకి చేరుకుంది. ఆండ్రే రస్సెల్ వేసిన 15వ ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్‌తో 14 పరుగులు రాబట్టిన అక్షర్ పటేల్, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు... 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన అక్షర్ పటేల్ అవుటయ్యే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 34 పరుగులు కావాలి.
సునీల్ నరైన్ 16వ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇవ్వగా వెంకటేశ్ అయ్యర్ వేసిన 17వ ఓవర్‌లో ఫోర్, సిక్సర్ బాదిన పావెల్ 14 పరుగులు రాబట్టాడు. టిమ్ సౌథీ వేసిన 18వ ఓవర్‌లో 12 పరుగులు రావడంతో ఢిల్లీ విజయం దాదాపు ఖరారైపోయింది.
విజయానికి 2 ఓవర్లలో 4 పరుగులు కావాల్సిన దశలో శ్రేయాస్ అయ్యర్ 19వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చాడు. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన పావెల్, ఢిల్లీకి విజయాన్ని అందించాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగుల ఓ మాదిరి స్కోరు చేసింది. ఆరోన్ ఫించ్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి ఛేతన్ సకారియా ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 బంతుల్లో 6 పరుగులు చేసిన మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సకారియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
నేటి మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన బాబా ఇంద్రజిత్ 8 బంతుల్లో 6 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పావెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే సునీల్ నరైన్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు కుల్దీప్ యాదవ్...
35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా కలిసి కేకేఆర్‌ని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని కుల్దీప్ యాదవ్ విడదీశాడు...
37 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ పట్టిన లో క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ నాలుగో బంతికి డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్ వికెట్ కోల్పోయింది కేకేఆర్...
3 బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన రస్సెల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్, నితీశ్ రాణా కలిసి ఏడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
16 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన రింకూ సింగ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో పావెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో 15వ హాఫ్ సెంచరీ బాదిన నితీశ్ రాణా... 34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో రింకూ సింగ్, నితీశ్ రాణాలను అవుట్ చేసిన ముస్తాఫిజుర్ రహ్మాన్, టిమ్ సౌథీని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్‌లో కేవలం 2 పరగులు మాత్రమే రావడంతో 150 స్కోరును దాటలేకపోయింది కేకేఆర్...
ముస్తాఫిజుర్ రహ్మాన్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడొట్టాడు. చేతన్ సకారియా, అక్షర్ పటేల్ చెరో ఓ వికెట్ తీశారు.
