IPL2022 CSK vs KKR:  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ నయా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... కెప్టెన్‌గా రవీంద్ర జడేజాకి మొదటి ఐపీఎల్ మ్యాచ్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన కేకేఆర్ నయా సారథి శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడడానికి ముందు అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవీంద్ర జడేజా. జడేజాకి ఇప్పటికే 200 ఐపీఎల్ మ్యాచులు ఆడగా, 153 ఐపీఎల్ మ్యాచుల తర్వాత గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన మనీశ్ పాండే రికార్డును తెరమరుగైంది. 

కేకేఆర్‌లో ఫారిన్ ప్లేయర్లుగా సామ్ బిల్లింగ్స్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్‌ల రూపంలో ముగ్గురికి తుది జట్టులో అవకాశం ఇవ్వగా... చెన్నై సూపర్ కింగ్స్ తరుపున డివాన్ కాన్వే, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే బరిలో దిగబోతున్నారు. 

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా సీఎస్‌కే కెప్టెన్‌గా కాకుండా సీఎస్‌కే ప్లేయర్‌గా బరిలో దిగుతున్నాడు. ఇంతకుముందు ఐపీఎల్ 2017 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కి ప్లేయర్‌గా ఆడినప్పటికీ, సీఎస్‌కే తరుపున ఎప్పుడూ సాధారణ ప్లేయర్‌గా మ్యాచులు ఆడలేదు మహేంద్ర సింగ్ ధోనీ... 

ఈ రెండు జట్లూ 2012లో తొలిసారి ఫైనల్‌లో తలబడగా కేకేఆర్ విజయం సాధించింది, రెండోసారి 2021 ఫైనల్‌ ఆడగా సీఎస్‌కే టైటిల్ సాధించింది. 2022లో ఇరు జట్లూ తలబడడంతో ఆసక్తి రేపుతోంది...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీకి రాజీనామా చేసిన ఎమ్మెస్ ధోనీ, కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా బరిలో దిగబోతున్నాడు. మాహీ బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వస్తాడా? ధోనీ ఏ పొజిషన్‌లో బ్యాటింగ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది..

గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, ఈ సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా నియమితుడయ్యారు. కేకేఆర్‌లో అజింకా రహానే, ఆరోన్ ఫించ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు ఉన్నారు. ఈ సీనియర్లను అయ్యర్ ఎలా వాడుకుంటాడనేది కీలకంగా మారింది...

కేకేఆర్ తరుపున వెంకటేశ్ అయ్యర్‌తో పాటు సీనియర్ ఓపెనర్ అజింకా రహానే ఓపెనింగ్ చేయబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి న్యూజిలాండ్ బ్యాటర్ డివాన్ కాన్వే ఓపెనింగ్ చేయబోతున్నాడు. 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎమ్మెస్ ధోనీ, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే