Asianet News TeluguAsianet News Telugu

IPL2022 CSK vs DC: చెన్నై కథ ఇంకా అయిపోలేదు... ఢిల్లీపై ఘన విజయంతో ప్లేఆఫ్స్ రేసులోకి...

కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్... భారీ లక్ష్యఛేదనలో కుదేలైన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం... 

IPL2022 CSK vs DC: Chennai Super Kings beats Delhi Capitals, fans hopes play-offs
Author
India, First Published May 8, 2022, 11:13 PM IST | Last Updated May 8, 2022, 11:13 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, కీలక మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుని... తిరిగి రేసులోకి వచ్చింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని 91 పరుగుల తేడాతో చిత్తు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... బౌలింగ్ ఫెయిల్ అయ్యి, 209 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాట్స్‌మెన్ కూడా మూకుమ్మడిగా ఫెయిల్ అవ్వడంతో 17.4 ఓవర్లలో 117 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఢిల్లీ...

209 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఏదీ కలిసి రాలేదు. 5 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, సిమర్‌జిత్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో అవుట్ కాగా 12 బతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, 11 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసిన రిషబ్ పంత్ ఇద్దరూ కూడా మొయిన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. 3 బంతుల్లో ఓ సిక్సర్‌ బాదిన రిపల్ పటేల్‌ని కూడా అవుట్ చేసిన మొయిన్ ఆలీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ని చావుదెబ్బ తీశాడు..

1 పరుగు చేసిన అక్షర్ పటేల్‌ని ముకేశ్ చౌదరి క్లీన్ బౌల్డ్ చేయగా 9 బంతుల్లో 3 పరుగులు చేసిన రోవ్‌మెన్ పావెల్‌ కూడా అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 72 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వెంటవెంట వికెట్లు కోల్పోయి 11 ఓవర్లు ముగిసే సమయానికి 85/7 స్థితికి చేరుకుంది... 

17 బంతుల్లో 5 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, సిమర్‌జిత్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా శార్దూల్ ఠాకూర్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఖలీల్ అహ్మద్ అవుట్ కావడంతో 117 పరుగుల వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్‌కి తెరపడింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు చేసింది... 

చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత శివమ్ దూబేతో కలిసి రెండో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు డివాన్ కాన్వే. 49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు చేసిన డివాన్ కాన్వే, సీజన్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీకి చేరువైన కాన్వేని ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు...

19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన శివమ్ దూబే, మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వెంటవెంట ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది సీఎస్‌కే...

ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో 19వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదిన అంబటి రాయుడు, ఆ తర్వాతి బంతికి అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన మొయిన్ ఆలీ కూడా నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ కాగా ఆ తర్వాతి బంతికే రాబిన్ ఊతప్ప గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...

క్రీజులోకి వస్తూనే మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో 6, 4 బాదిన ఎమ్మెస్ ధోనీ... 8 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో సీఎస్‌కే 200+ మార్కుని దాటగలిగింది.

సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ 18 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచిన కుల్దీప్ యాదవ్, నేటి మ్యాచ్‌లో ఘోరంగా విఫలం కావడం విశేషం. తొలి ఓవర్‌లో 18, రెండో ఓవర్‌లో 16 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్... 3 ఓవర్లలో 43 పరుగులు సమర్పించాడు. కుల్దీప్ పూర్తి కోటా కూడా పూర్తి చేయలేకపోయాడు.

ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా ఆన్రీచ్ నోకియా 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.  మిచెల్ మార్ష్ ఓ వికెట్ తీయగా ఢిల్లీ క్యాపిటల్స్‌లోని మిగిలిన బౌలర్లు ఎవ్వరూ వికెట్ తీయలేకపోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios