Kieron Pollard: ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కు కొత్త తలనొప్పి పట్టుకున్నది. రూ. 6 కోట్లు పోసి రిటైన్ చేసుకున్న వెస్టిండీస్ సారథి తరుచూ గాయాల బారిన పడుతుంటంతో...
ఐపీఎల్ వేలం దగ్గరపడుతున్న వేళ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ పట్టుకున్నది. గతేడాది ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్ ను తీసుకుని తప్పు చేశామనే భావన ముంబై ఇండియన్స్ యాజమాన్యంలో వచ్చిందా..?అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు ఫ్యాన్స్. పొలార్డ్ కు బదులు డాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ను తీసుకున్నా బాగుండేదని వాళ్లు భావిస్తున్నారు. పొలార్డ్ తరుచూ గాయాల బారిన పడుతుండటమే దీనికి కారణం.
బుధవారం అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో ముగిసిన రెండో వన్డేలో పొలార్డ్ ఆడలేదు. గాయం కారణంగా అతడు ఆఖరి నిమిషంలో మ్యాచు నుంచి తప్పుకున్నాడు. దీంతో తాత్కాలిక సారథి నికోలస్ పూరన్.. జట్టును నడిపించాడు. మ్యాచ్ ముగిశాక పొలార్డ్ ఆరోగ్యం గురించి ఆరాతీయగా.. అతడు ఫిట్ అవుతున్నాడని పూరన్ చెప్పాడు. అయితే మూడో వన్డే కు కూడా పొలార్డ్ అందుబాటులో ఉండేది అనుమానమే అని తెలుస్తున్నది. తొలి వన్డేలో కూడా పొలార్డ్ డకౌట్ గా వెనుదిరిగాడు.
ఈ నేపథ్యంలో ముంబై ఫ్యాన్స్ కు కొత్త తలనొప్పి పట్టుకున్నది. పొలార్డ్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో పాటు గతంలో మాదిరిగా మెరుపులు మెరిపించడం లేదు. అదీగాక గాయాలతో ప్రతి సిరీస్ కు కొన్ని మ్యాచులలో దూరంగా ఉంటున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే నెలలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ వరకు అతడు ఎంత మేర ఫిట్ గా ఉంటాడనేది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ను వేధిస్తున్న ప్రశ్న.
అహ్మదాబాద్ రెండో వన్డేతో పాటే.. గత డిసెంబర్ లో వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా పొలార్డ్ ఆడలేదు. గాయంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గతేడాది దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా పలు మ్యాచులకు అతడు అందుబాటులో లేడు. ఇక ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా గాయాలతో సతమతమవుతూనే కనిపించాడు.
గతేడాది ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ రోహిత్ శర్మ ను రూ. 16 కోట్లకు దక్కించుకున్న ముంబై.. బుమ్రా ను రూ. 12 కోట్లకు, సూర్యకుమార్ యాదవ్ ను రూ. 8 కోట్లకు, కీరన్ పొలార్డ్ ను రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకున్నది. తాజా పరిస్థితులు చూస్తే పొలార్డ్.. పూర్తి స్థాయిలో ఐపీఎల్ ఆడతాడా..? అనేది ముంబై అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఇప్పటికే 34 ఏండ్ల వయసులో ఉన్న పొలార్డ్.. గతంలో మాదిరిగా మెరుపులు కూడా మెరిపించలేకపోతున్నాడు. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ముంబై.. పొలార్డ్ కు బదులు ఇషాన్ ను తీసుకుని ఉంటే బావుండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అప్పుడు రిటైన్ చేసుకోకున్నా ఈనెల 12, 13 తేదీలలో జరుగబోయే వేలంలో అయినా ఇషాన్ ను తీసుకోవాలని ముంబై ఫ్రాంచైజీకి సూచిస్తున్నారు.మరి ముంబై యాజమాన్యం మనసులో ఏముందో...?
