బయో బబుల్‌ ఐపీఎల్లో తొలి విజయం కోసం ఆరాటపడుతున్న జట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నెగ్గాల్సిన మ్యాచ్‌ను చేజేతులా కోల్పోగా... కోల్‌కత అసలు విజయానికి దగ్గరగా వెళ్లలేదు. 

చిన్న చిన్న తప్పిదాలను సరి చేసుకుని గెలుపుబాట పట్టాలని హైదరాబాద్‌ భావిస్తుండగా, సన్‌రైజర్స్‌పై కొత్తగా వేట మొదలుపెట్టాలనే యోచనలో కోల్‌కత కనిపిస్తోంది. ఇరు జట్లు సీజన్‌లో తొలి విజయం కోసం ఆడుతున్న ఈ మ్యాచ్‌ దుబాయ్‌ క్రికెట్‌ స్టేడియంలో నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

మిడిల్‌ సర్దుకుంటే చాలు!...

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పెద్దగా తప్పిదాలు చేయలేదు. టాప్‌ ఆర్డర్‌లో జానీ బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే దాదాపుగా పని పూర్తి చేశారు. డెవిడ్‌ వార్నర్‌ అసహజ రనౌట్‌తో హైదరాబాద్‌ ఓ విధ్వంసక ఇన్నింగ్స్‌ను కోల్పోయింది. 

దేశవాళీ కుర్రాళ్లతో కూడిన మిడిల్‌ ఆర్డర్‌ మెప్పించలేదు. ప్రియాం గార్గ్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మలు నిరాశపరిచారు. నేటి మ్యాచ్‌కు కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. లేదంటే మరో అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబి తుది జట్టులోకి రానున్నాడు. 

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) ఫామ్‌లో ఉన్న మహ్మద్‌ నబి సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు. హైదరాబాద్‌ బౌలింగ్‌ విభాగం స్వింగ్‌, స్పిన్‌కు పెట్టింది పేరు. భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌లతో పాటు రషీద్‌ ఖాన్‌లు కోల్‌కత భీకర బ్యాటింగ్‌ లైనప్‌కు చెక్‌ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆ ఇద్దరు మెరవాలి!...

కోల్‌కత నైట్‌రైడర్స్‌లో కీలక ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించగల విధ్వంసకారులు ఇద్దరే ఉన్నారు!. కరీబియన్‌ వీరుడు అండ్రీ రసెల్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌లపైనే కోల్‌కత బ్యాటింగ్‌ లైనప్‌ ఆధారపడి ఉంది. 

టాప్‌ ఆర్డర్‌లో ప్రతిభావంతుడైన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. నేడు హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనైనా గిల్‌ రాణిస్తాడేమో చూడాలి. పించ్‌ హిట్టింగ్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌కు గత మూడు సీజన్లలో బ్యాట్‌తోనే ఎక్కవగా రాణిస్తున్నాడు. షార్ట్‌ పిచ్‌ బంతులకు తడబడుతున్నా, హైదరాబాద్‌లో స్వింగ్‌ బౌలర్లే ఉన్నారు. అత్యంత వేగవంతమైన పేసర్లు లేరు. దీంతో నరైన్‌ నేడు మ్యాచ్‌లో రెచ్చిపోయే వీలుంది. 

కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌, నితీశ్‌ రానాలు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. నేటి మ్యాచ్‌లో నిఖిల్‌ నాయక్‌ తన స్థానాన్ని రాహుల్‌ త్రిపాఠికి కోల్పోయే ప్రమాదం ఉంది. బౌలింగ్‌ విభాగంలో యువ పేసర్‌ శివం మావి ఆకట్టుకున్నాడు. సందీప్‌ వారియర్‌, పాట్‌ కమిన్స్‌లు పరుగుల పొదుపు పాటించాలి. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఐపీఎల్‌లో తన మార్క్‌ చూపించడానికి కొత్త అస్త్రాల కోసం అన్వేషణ చేయక తప్పదు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), డెవిడ్ వార్నర్‌ (కెప్టెన్‌), మనీశ్‌ పాండే, ప్రియాం గార్గ్‌, కేన్‌ విలియమ్సన్‌/మహ్మద్‌ నబి, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌.

కోల్‌కత నైట్‌రైడర్స్‌... సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), నితీశ్‌ రానా, ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రసెల్‌, నిఖిల్‌ నాయక్‌/రాహుల్‌ త్రిపాఠి, పాట్‌ కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌, శివం మవి, సందీప్‌ వారియర్‌.