సులువుగా గెలవాల్సిన మ్యాచులను చిన్న తప్పిదాలతో చేజార్చుకోవటం ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు వెన్నతో పెట్టిన విద్య!. బలమైన టాప్‌ ఆర్డర్‌తో గెలుపు బాటలు వేసుకుని ఆఖర్లో బోల్తా పడటం ఆ జట్టుకు కొత్త కాదు. 

ఇదే సమయంలో ప్రత్యర్థిని ఆరంభంలో కట్టడి చేసినా, డెత్‌ ఓవర్లలో పరుగుల నియంత్రణ కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థుల చేతుల్లో పెట్టడమూ కోహ్లిసేనకు తెలిసిన విద్యే. బ్యాటింగ్‌ లైనప్‌లో కొన్నిసార్లు ఆర్‌సీబీ బలహీనతలు సన్‌రైజర్స్‌లో కనిపించినా.. బౌలింగ్‌ విభాగంలో ఎన్నడూ అటువంటి పరిస్థితి తలెత్తలేదు. 

చేతుల్లో లేని మ్యాచులను సైతం హైదరాబాద్‌ బౌలర్లు తమ వైపు తిప్పుకున్న సందర్భాలు కోకోల్లలు. దుబాయ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో‌ ఆర్‌సీబీ...  సన్‌రైజర్స్‌ స్టయిల్‌లో విజయం సాధించింది.

164 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 89/1, 121/2తో విజయం దిశగా దూసుకెళ్లింది స్లాగ్‌ ఓవర్లలో పరుగులు సమర్పించుకోవటంలో బెంగళూర్‌ ఫేమస్‌. ఇటువంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్‌ను బెంగళూర్‌ కట్టడి చేస్తుందని ఎవరూ ఊహించలేదు. 

కానీ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే బెంగళూర్‌ మార్పును చూపించింది. తమ బలహీనతను బలంగా చేసుకుని తొలి విజయాన్నినమోదు చేసింది.  121/2తో పటిష్టంగా ఉన్న హైదరాబాద్‌ను అద్భుత బౌలింగ్‌తో 153 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

డెవిడ్‌ వార్నర్‌ ఊహించని రనౌట్‌ తర్వాత నిలదొక్కుకున్న జానీ బెయిర్‌స్టో, మనీశ్‌ పాండేలు స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ను ఎదుర్కొన్న తీరే ఓటమికి కారణమని చెప్పవచ్చు. స్పిన్‌ అనుకూలిత దుబాయ్‌ పిచ్‌పై చాహల్‌పై ఎదురుదాడి చేసేందుకు బెయిర్‌స్టో, మనీశ్‌ పాండేలు ప్రయత్నించారు. ఇద్దరూ ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. ఇక్కడే ఆర్‌సీబీ మ్యాచ్‌ను తనవైపునకు తిప్పుకుంది.

ఐపీఎల్‌ 2020లో హైదరాబాద్‌ బలహీనత మిడిల్‌ ఆర్డర్‌ కావచ్చనే అంచనాలు తొలి మ్యాచ్‌లోనే నిజమయ్యాయి. ఆడుతూ పాడుతూ నెగ్గాల్సిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ చేజేతులా ఓడింది. మిడిల్‌ ఆర్డర్‌లో యువ బ్యాట్స్‌మెన్‌ ప్రియాం గార్గ్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మలు విఫలమయ్యారు. 

ఇందులో ప్రియాం గార్గ్‌ హెల్మెట్‌ వికెట్‌ పైకి పడి అవుటవగా.. రషీద్‌ ఖాన్‌తో పిచ్‌ మధ్యలో ఢీకొట్టి అభిషేన్‌ నిష్ర్కమించాడు. విజయ్‌ శంకర్‌ను చాహల్‌ అద్భుత బంతితో బౌల్డ్‌ చేశాడు. తొలి మ్యాచ్‌లో ఓటమికి కారణమైన మిడిల్‌ ఆర్డర్‌ను కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ వెనకేసుకొచ్చాడు. 

' కుర్రాళ్లపై నమ్మకం లేకపోతే, వారిని మిడిల్‌ ఆర్డర్‌లో ఆడనిచ్చేవాళ్లం కాదు. మిడిల్‌ ఆర్డర్‌ను విమర్శించాలనుకుంటే, అది నేను ఇది వరకు చూడనిదే అవుతుంది. మ్యాచ్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ అసహజ రీతిలో అవుటయ్యారు. కుర్రాళ్లకు ఒకటే చెప్పాం. సహజ శైలిలో ఆడమని ప్రోత్సహించాం. అప్పుడే వారు స్వేచ్ఛగా ఆడగలరు. పది కోట్ల మంది వీక్షిస్తున్న మ్యాచ్‌లో ఒత్తిడి, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం కీలకం' అని వార్నర్‌ అన్నాడు.

సీనియర్‌ బ్యాట్‌్సమన్‌ కేన్‌ విలియమ్సన్‌ లేని లోటు బెంగళూర్‌ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన విలియమ్సన్‌ ఆర్‌సీబీతో మ్యాచ్‌కు సెలక్షన్‌కు అందుబాటులో లేడు. విలియమ్సన్‌ స్థానంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ తుది జట్టులోకి వచ్చినా.. గాయంతో మ్యాచ్‌ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. 

స్వల్ప స్కోర్లు నమోదవుతున్న యుఏఈ పిచ్‌లపై కేన్‌ విలియమ్సన్‌ను తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. కేన్‌ విలియమ్సన్‌ గాయంపై, ఎప్పటికి అందుబాటులోకి వస్తాడనే సమాచారం సన్‌రైజర్స్‌ వెల్లడించలేదు.  మిడిల్‌ ఆర్డర్‌లో విలియమ్సన్‌ లేని వేళ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ హైదరాబాద్‌పై హైదరాబాద్‌ స్టయిల్‌లో గెలుపొందటం విశేషం.