ఆరెంజ్‌ ఆర్మీ పేరుకు తగినట్టుగానే.. ఐపీఎల్‌లో వరుసగా ఆరెంజ్‌ క్యాపులు దక్కించుకుంటోంది. 2015లో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాతి ఏడాది నుంచి అద్భుత ప్రదర్శన చేస్తోంది. 

2016లో టైటిల్‌ విజయం సాధించిన హైదరాబాద్‌.. వరుసగా ప్లే ఆఫ్స్‌లో స్థానం సాధించింది. సమష్టి ఆటతీరుకు పెట్టింది పేరైన హైదరాబాద్‌కు.. ప్రతీ సీజన్‌లో కెప్టెన్‌ పరుగుల పారిస్తున్నాడు. 

గత మూడు సీజన్లుగా ఆరెంజ్‌ క్యాప్‌ హైదరాబాద్‌ సొంతమవుతూ వచ్చింది. నేడు బెంగళూర్‌తో మ్యాచ్‌తో సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ 2020 టైటిల్‌ వేటకు తెర లేపనుంది. ఇదే సమయంలో ఆరెంజ్‌ క్యాప్‌ కోసం హైదరాబాద్‌ నాయకుడు డెవిడ్‌ వార్నర్‌ వేట కూడా ఆరంభం కానుంది!.

2019 ఐపీఎల్‌లో డెవిడ్‌ వార్నర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు.  కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వంలో డెవిడ్‌ వార్నర్‌ 12 మ్యాచుల్లోనే 692 పరుగులు సాధించాడు. ఓ సెంచరీ, 8 అర్ధ సెంచరీలతో చెలరేగిన వార్నర్‌ 69.20 సగటుతో విశ్వరూపం చూపించాడు.  ఈ సీజన్‌లో వార్నర్‌ 21 సిక్సర్లు, 57 ఫోర్లు బాదాడు.

బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో కెప్టెన్సీకి వార్నర్‌ దూరం కాగా.. కేన్‌ విలియమ్సన్‌ 2018 ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు సారథ్యం వహించాడు.  2018లో ఫైనల్స్‌కు చేరుకున్న హైదరాబాద్‌.. టైటిల్‌ను చెన్నైకి కోల్పోయింది. ఈ సీజన్‌లో విలియమ్సన్‌ 17 మ్యాచుల్లో 735 పరుగులు పిండుకుని ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు.  52.50 సగటుతో 8 అర్థ సెంచరీలు సాధించిన కేన్‌.. 64 ఫోర్లు, 28 సిక్సర్లు కొట్టాడు.

2017 ఐపీఎల్‌లో సైతం డెవిడ్‌ వార్నర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. 14 మ్యాచుల్లో 58.27 సగటుతో 641 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో వార్నర్‌ ఓ సెంచరీ సహా నాలుగు అర్ధ శతకాలు బాదాడు. 63 ఫోర్లు, 26 సిక్సర్లు సైతం కొట్టాడు.

2016 ఐపీఎల్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ ఆరెంజ్‌ ఆర్మీ నుంచి తృటిలో చేజారింది. విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ విశ్వరూపం చూపిన ఈ సీజన్‌లో డెవిడ్‌ వార్నర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. రికార్డు స్థాయిలో విరాట్‌ నాలుగు సెంచరీలు, 7 అర్థ సెంచరీలతో 973 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఓ సీజన్‌కు ఇవే అత్యధిక పరుగుల రికార్డు. 9 అర్థ శతకాలతో డెవిడ్‌ వార్నర్‌ 848 పరుగులు చేశాడు.

వరుసగా మూడు సీజన్లుగా ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 2020లోనూ ఆరెంజ్‌ క్యాప్‌పై కన్నేసింది.  ఈ సీజన్‌లో సైతం కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ పరుగుల వేటలో ఆర్‌సీబీ సారథి విరాట్‌ కోహ్లితో పోటీపడనున్నాడు.