భారత క్రికెట్‌లో తరచుగా వివాదాలకు కారణం అవుతోన్న అంశం విరుద్ధ ప్రయోజనాలు.  భారత క్రికెట్‌ పరిపాలన పదవుల్లో కొనసాగుతూ, తమకు సంబంధించిన వ్యక్తులు, కంపెనీలు, సంస్థలకు అనుచిత ప్రయోజనం కలిగించటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది. 

కరోనా మహమ్మారి, యుఏఈలో ఐపీఎల్‌తో బీసీసీఐ రెగ్యులర్‌ వివాదాలకు కొంత కాలం బ్రేక్‌ పడిందని అనుకుంటే.. స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు నోరు జారటంతో గంగూలీ విరుద్ధ ప్రయోజనాలు తెరపైకి వచ్చాయి.  కెప్టన్సీ అనుభవం, పురోగతిపై వ్యాఖ్యాత సైమన్‌ డౌల్‌ అడిగిన ప్రశ్నకు అయ్యర్‌ సమాధానం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.  

'ఓ కెప్టన్‌గా మంచి టెంపర్‌మెంట్‌ అవసరం. గత కొన్నేండ్లలో నేను అది సాధించానని అనుకుంటున్నాను. సౌరభ్‌ గంగూలీ, రికీ పాంటింగ్‌ వంటి దిగ్గజాలు మన చుట్టూ ఉన్నప్పుడు, మన పని మరింత సులభతరం అవుతుంది' అని అయ్యర్‌ అన్నాడు. 

2019 ఐపీఎల్‌ సీజన్‌లో సౌరభ్‌ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటర్‌గా పని చేశాడు. అందుకే తన కెప్టెన్సీపై దాదా ప్రభావం ఉందని, ఆయన సూచనలు పని చేశాయని అయ్యర్‌ భావన కావచ్చనే వాదన వినిపిస్తోంది. కానీ ప్రస్తుత సీజన్‌లో దాదా, రికీలు తనవైపు ఉన్నారని అయ్యర్‌ అనటం వివాదానికి దారితీస్తోంది.

జెఎస్‌డబ్ల్యూతో దాదా బంధం...

సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు నుంచీ ఐపీఎల్‌లో మెంటర్‌గా కొనసాగుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ శిక్షణ సారథ్యంలో కీలక స్థానంలో కొనసాగాడు. బీసీసీఐ పగ్గాలు అందుకున్న అనంతరం ఇతర పదవులకు దాదా గుడ్‌ బై చెప్పాడు. 

అయితే, మాజీ క్రికెటర్‌గా దాదా వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.  ఐపీఎల్‌ ఢిల్లీ ప్రాంఛైజీలో 50 శాతం వాటాను జిఎంఆర్‌ సంస్థ జెఎస్‌డబ్ల్యూ సంస్థకు అప్పగించింది. ఒప్పందం ప్రకారం రెండేండ్లు ప్రాంఛైజీ నిర్వహణ బాధ్యత జెఎస్‌డబ్ల్యూ చూసుకుంటుంది. 

రానున్న రెండేండ్ల పాటు నిర్వహణ బాధ్యతల్లోకి తిరిగి జిఎంఆర్‌ గ్రూప్‌ రానుంది. జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సంస్థల కంపెనీ జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు సౌరభ్‌ గంగూలీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. 

అధికారికంగా పదవిలో లేకపోయినా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్‌లో మెంటర్‌షిప్‌ కొనసాగిస్తున్నాడనే ఆరోపణలకు శ్రేయస్ అయ్యర్‌ మాటలతో బలం చేకూరింది.

ఇదిలా ఉండగా, ఫాంటసీ గేమింగ్‌ కంపెనీ డ్రీమ్‌ 11 ఐపీఎల్‌కు అధికారిక టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యహరిస్తోంది. మార్కెట్‌లో డ్రీమ్‌11కు ప్రత్యక్ష పోటీదారు మైసర్కిల్‌11కు సౌరభ్‌ గంగూలీ ప్రచారకర్తగా ఉంటున్నాడు.  బీసీసీఐ వర్గాల్లో ఇదీ ఆసక్తికర చర్చకు దారితీసింది.

అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు..

బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతూ, ఐపీఎల్‌లో ఓ ప్రాంఛైజీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సౌరభ్‌ గంగూలీపై బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసర్‌ జస్టిస్‌ డికె జైన్‌కు మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా సెప్టెంబర్‌ 1న ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

బీసీసీఐ రాజ్యాంగంలోని నిబంధనలు 38(2)(బి) ఆధారంగా రూల్‌ 38 (4)ను గంగూలీ ఉల్లంఘించాడని సంజీవ్‌ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. అంబుడ్స్‌మన్‌ త్వరలోనే గంగూలీ విరుద్ధ ప్రయోజనాలపై విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది.