Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2020: డ్రీమ్ ఎలెవన్ మీద తలెత్తుతున్న ప్రశ్నలు

వివో స్థానంలో డ్రీమ్‌ 11కు టైటిల్‌ హక్కులు కట్టబెట్టి, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించామనే భ్రమను కలిగించటంలో బీసీసీఐ విజయవంతమైంది. కానీ ఇక్కడ బీసీసీఐ పక్కా బిజినెస్‌ ప్లాన్‌ అమలు చేసింది. కరోనా కారణంగా మార్కెట్‌ భారీగా పడిపోయింది. వివో రూ.440 కోట్లు చెల్లించే పరిస్థితిలో లేనని బోర్డుకు విన్నవించింది. 

IPL2020 : Questions Arise Over Dream11's Credentials
Author
Hyderabad, First Published Aug 21, 2020, 11:05 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా వేళా పడకేసిన క్రికెట్ నెమ్మదిగా తెరుచుకుంటున్న తరుణంలో ఐపీఎల్ పై కూడా ఆశలు చిగురించాయి. ఇంతలోనే వివోపై వివాదం. ఆ తరువాత బీసీసీఐ కూడా తలొగ్గిందన్నట్టుగా వివోను తప్పించి ఇప్పుడు డ్రీం11 కు స్పాన్సర్షిప్ అప్పగించడంతో కొత్త వివాదం మొదలయింది. 

గాల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణ అనంతరం చైనా ఉత్పత్పుల బహిష్కరణకు అతివాద జాతీయవాద సంఘాలు పిలుపునిచ్చాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగుతున్న చైనా మొబైల్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివోను తప్పించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. 

దీంతో ఐపీఎల్‌లో విదేశీ కంపెనీల స్పాన్సర్‌షిప్‌లపై సమీక్ష చేస్తామని బీసీసీఐ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా బీసీసీఐ రెండు వారాల గడువులో ఆ పని చేయలేదు. ఐపీఎల్‌2020 నిర్వహణకు ముందు ఏర్పాటు చేసిన గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో వివో టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌గా కొనసాగుతుందని బీసీసీఐ ప్రకటించింది. 

ఈ ప్రకటనతో ది కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటి), స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ)లు ఐపీఎల్‌ 2020 బహిష్కరిస్తామని బోర్డును హెచ్చరించాయి. ఈ పరిస్థితుల్లో వివో ఐపీఎల్‌ 2020 స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్టు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అక్కడితో కథ సుఖాంతం అయ్యిందనే భావనలో అందరూ ఉండిపోయారు. కానీ నిజానికి జరిగింది ఏమిటీ?

డ్రీమ్ ఎలెవన్ లోను చైనా సంస్థదే భారీ పెట్టుబడి.... 

డ్రీమ్‌ 11ను భారతీయులు మొదలుపెట్టారు. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబాని సన్నిహితుడు, స్కూల్‌మేట్‌ ఆనంద్‌ జైన్‌ కుమారుడు హర్ష్‌ జైన్‌ తన స్నేహితులతో కలిసి డ్రీమ్‌11ను 2008లో ఆరంభించాడు. డ్రీమ్‌ 11లో చైనా వ్యాపార దిగ్గజం టెన్సెంట్‌ ( 1000 బిలియన్‌ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం) 2018లో భారీ పెట్టుబడి పెట్టింది. 

సుమారు 100 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లను డ్రీమ్‌ 11లో పెట్టుబడిగా పెట్టింది. ఆ సమయంలో మారకం విలువ ప్రకారం పెట్టుబడి రూ.720 కోట్లు. ఐపీఎల్‌ ఒరిజినల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ వివో సైతం భారత సబ్సీడరీ కంపెనీ. చైనా కంపెనీ ఇక్కడ రూ.7500 కోట్ల పెట్టుబడి పెట్టింది. 

భారత్‌లోనే స్మార్ట్‌ఫోన్‌ తయారీ ప్లాంట్లను నిర్మించుకుని, దేశవ్యాప్తంగా స్టోర్లను నడుపుతోంది. వివో కంపెనీలో వేలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. అదే డ్రీమ్‌11లో 500 పైలుకు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్థిక మూలాల ప్రకారం చూసినప్పుడు వివో మాదిరిగానే డ్రీమ్‌ 11లోనూ చైనా కంపెనీ పెట్టుబడులు ఉన్నాయి. 

వివో స్థానంలో డ్రీమ్‌ 11కు టైటిల్‌ హక్కులు కట్టబెట్టి, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించామనే భ్రమను కలిగించటంలో బీసీసీఐ విజయవంతమైంది. కానీ ఇక్కడ బీసీసీఐ పక్కా బిజినెస్‌ ప్లాన్‌ అమలు చేసింది. కరోనా కారణంగా మార్కెట్‌ భారీగా పడిపోయింది. వివో రూ.440 కోట్లు చెల్లించే పరిస్థితిలో లేనని బోర్డుకు విన్నవించింది. 

వాస్తవ ఒప్పందంలో 50 శాతమే చెల్లిస్తామని ప్రతిపాదన చేసింది. బీసీసీఐ అందుకు అంగీకారం తెలపలేదు. అదే సమయంలో చైనా కంపెనీపై వ్యతిరేకతో బహిరంగ టెండర్లను పిలిచింది. రూ.222 కోట్లతో డ్రీమ్‌ 11 టైటిల్‌ హక్కులు దక్కించుకుంది.

డ్రీమ్‌11 విశ్వసనీయత ప్రశ్నార్థకమే.... 

2013 స్ఫాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంతో విశ్వసనీయత కోల్పోయిన ఐపీఎల్‌.. తాజాగా డ్రీమ్‌ 11తో జట్టుకట్టడంపై నైతిక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో పంజాబ్‌లో జరిగిన ఓ క్రికెట్‌ మ్యాచ్‌ను శ్రీలంకలోని ఓ టోర్నీగా ప్రచారం కల్పించారు. ఆ మ్యాచ్‌పై డ్రీమ్‌ 11లో ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమింగ్‌ జరిగింది. 

డ్రీమ్‌ స్పోర్ట్స్‌ గ్రూప్‌ డిజిటల్‌ సంస్థ ఫ్యాన్‌కోడ్‌ ఆ మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో ప్రసారం చేసింది. ఆ మ్యాచ్‌లో క్రికెటర్లు డ్రీమ్‌ 11 లోగోలు కలిగిన జెర్సీలు ధరించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా బీసీసీఐ పంజాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఫేక్‌ టీ20తో మ్యాచ్‌తో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న ఓ సంస్థ బీసీసీఐ భాగస్వామిగా చేరటం ఆశ్చర్యానికి గురిచేస్తోన్న అంశం. వివో టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి 50 శాతం నిధులు ఎనిమిది ప్రాంఛైజీలు (రూ.20 కోట్లు) అందుకునేవి. ఇప్పుడు డ్రీమ్‌11 రాకతో మొత్తం రూ.10 కోట్లకు పడిపోయింది. 

టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌తో పాటు ఆరు ప్రాంఛైజీలతోనూ డ్రీమ్‌ 11 ఒప్పందం చేసుకుంది. చైనా మూలాలు లేని కంపెనీని ఐపీఎల్‌ స్పాన్సర్‌గా ప్రజలు కోరుకున్నారు కానీ వివో స్థానంలో చైనా కంపెనీ పెట్టుబడి కలిగిన మరో సంస్థను కాదు. అయినా, ఈ విషయంలో బీసీసీఐ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్టు చేస్తూ, పక్కా వ్యాపార ప్రణాళిక అమలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios