Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ వేదిక ఫిక్స్, ఐసీసీ ఆమోదం కోసమే....

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 నిర్వహణకు బీసీసీఐ వేగంగా పావులు కదుపుతోంది. అక్టోబర్‌లో జరగాల్సిన 2020 టీ20 మెన్స్‌ వరల్డ్‌కప్‌పై ఐసీసీ తుది నిర్ణయం ఇంకా నాన్చుతోంది. ఐసీసీ నిర్ణయం కోసం నిరీక్షణ ఆపేసి, ఐపీఎల్‌ 2020 నిర్వహణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తోంది. 

IPL2020 In UAE: Waiting For ICC Nod
Author
Hyderabad, First Published Jul 17, 2020, 7:31 AM IST

కరోనా దెబ్బకు అన్ని క్రీడా వేడుకలు వాయిదాపడడమో, రద్దవడమో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే క్రీడలు చిన్నగా ప్రారంభమవుతున్నాయి. క్రికెట్ సైతం 117 రోజుల తరువాత ఇప్పుడు మరల ప్రారంభమయ్యింది. ఆట ప్రారంభమవడంతో.... అభిమానులంతా ఐపీఎల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ జరగడం తథ్యం అనే విషయం తేలినప్పటికీ... ఎక్కడ అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. 

ఈ విషయమై, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 నిర్వహణకు బీసీసీఐ వేగంగా పావులు కదుపుతోంది. అక్టోబర్‌లో జరగాల్సిన 2020 టీ20 మెన్స్‌ వరల్డ్‌కప్‌పై ఐసీసీ తుది నిర్ణయం ఇంకా నాన్చుతోంది. ఐసీసీ నిర్ణయం కోసం నిరీక్షణ ఆపేసి, ఐపీఎల్‌ 2020 నిర్వహణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తోంది. 

ఈ మేరకు యుఏఈలో ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ అధికారికంగా వాయిదా పడింది. ప్రోటోకాల్‌ ప్రకారం ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడకుండా.. ఐపీఎల్‌ 2020పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయడానికి వీల్లేదు. అలాగని ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉండిపోలేదు. 

భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులతో క్రికెెటర్ల క్యాంప్‌ నిర్వహించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. కానీ లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఐపీఎల్‌ ప్రధాన నగరాలు ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. 

ఈ పరిస్థితుల్లో భారత్‌లో క్రికెటర్లకు క్యాంప్‌ నిర్వహించటం ఏమంత సురక్షితం కాదని బీసీసీఐ భావించింది. దీంతో యుఏఈలోనే క్రికెటర్లకు మూడు వారాల శిక్షణా శిబిరం నిర్వహించాలని అనుకుంటోంది. 30-35 మంది క్రికెటర్లతో క్యాంప్‌ అనంతరం ఐపీఎల్‌ ఆరంభానికి ముందు తమ తమ ప్రాంఛైజీలతో చేరనున్నారు. 

వేదిక ఎక్కడంటే... 

ఐపీఎల్‌ 2020 నిర్వహణకు శ్రీలంక, యుఏఈలు ఆతిథ్య ఆఫర్‌ ఇచ్చాయి. 2014 ఐపీఎల్‌ తొలి దశ మ్యాచులు యుఏఈలో నిర్వహించారు. దీంతో ఐపీఎల్‌ 13కు సైతం యుఏఈ ఆతిథ్య రేసులో ముందుంది. సెప్టెంబర్‌ 26న ఆరంభ మ్యాచ్‌తో బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్‌ తాత్కాలిక షెడ్యూల్‌ తయారు చేసింది. భారత క్రికెటర్లు, ఇతర విదేశీ క్రికెటర్లు ఆగస్టు మూడో వారంలోనే దుబారుకి చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఐపీఎల్‌ 2020 అనంతరం, భారత క్రికెటర్లు దుబారు నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు కీలక సమావేశం కానుంది. అపెక్స్‌ కౌన్సిల్‌ నేడు వీడియో కాన్ఫరెన్స్‌లో భేటీ కానుంది. జూన్‌ 30తో పదవీ కాలం ముగించుకున్న (మాజీ) కార్యదర్శి జై షా సమావేశానికి హాజరు కావటంపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో బీసీసీఐ క్రికెట్‌ పున ప్రారంభం సహా ఇతర విధానపరమైన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios