Asianet News TeluguAsianet News Telugu

దుబాయిలోఐపీఎల్: ఫ్రాంచైజీలు ఎదుర్కుంటున్న సవాళ్లు ఇవే..

ఐపీఎల్ పై ప్రాంఛైజీలు సమాధానం దొరకని ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగస్టు 2న సమావేశం కానుంది. ఐపీఎల్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ సహా ఇతర కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆ అంశాలేమిటో ఒకసారి చూద్దాము. 

IPL2020 In UAE: Franchises To Face These Challenges
Author
Mumbai, First Published Aug 1, 2020, 3:01 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 షెడ్యూల్‌ వచ్చేసింది. ఆరంభ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 19 ఖరారు కాగా.. అంతిమ సమరం నవంబర్‌ 8 లేదా 10పై పీటముడి కొనసాగుతోంది. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణకు ఎన్నో లాజిస్టికల్‌ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ప్రత్యేకించి ఐపీఎల్ పై ప్రాంఛైజీలు సమాధానం దొరకని ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగస్టు 2న సమావేశం కానుంది. ఐపీఎల్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ సహా ఇతర కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆ అంశాలేమిటో ఒకసారి చూద్దాము. 

క్వారంటైన్‌, కోవిడ్‌ పరీక్షలు, ఐసోలేషన్‌...

జట్ల క్వారంటైన్‌కు సంబంధించిన నిబంధనలు, ఎవరైనా కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలితే తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత కోసం ప్రాంఛైజీలు ఎదురుచూస్తున్నాయి. లీగ్‌ మధ్యలో ఓ ఆటగాడికి వైరస్‌ సోకితే, అతడిని మాత్రమే ఐసోలేషన్‌లో ఉంచాలా? ఇతర ఆటగాళ్లకు తక్షణమే పరీక్షలు చేయాలా?

ఒకవేళ మ్యాచ్‌ రోజు పాజిటివ్‌గా తేలితే అప్పుడు ఏం చేయాలి? పాజిటివ్‌ ఆటగాడు ఉంటున్న హౌటల్లోనే ఇతర జట్లు ఉంటే.. అప్పుడు పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు ప్రాంఛైజీలను వేధిస్తున్నాయి. జోఫ్రా ఆర్చర్‌ తరహాలో ఎవరైనా బయో సెక్యూర్‌ బబుల్‌ ప్రోటోకాల్‌ను అతిక్రమిస్తే తీసుకోవాల్సిన చర్యలపై సైతం ప్రాంఛైజీలు స్పష్టత కోరుతున్నాయి.

బబుల్‌ వాతావరణం, కోవిడ్‌ పరీక్షలు...

ఐపీఎల్‌ లీగ్‌ మధ్యలో క్రికెటర్లు ఏ సమయంలో కోవిడ్‌19 పరీక్షలు వెళ్లాలనే విషయమపై గవర్నింగ్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. కోవిడ్‌19 పరీక్షల బాధ్యత బీసీసీఐ తీసుకుంటుందా? ప్రాంఛైజీలు చూసుకోవాలనే అంశంపై స్పష్టత అవసరం.

ఎనిమిది ప్రాంఛైజీలు ఎనిమిది బబుల్స్‌లో ఉండనున్నాయి. మ్యాచ్‌ అధికారులు, ప్రసారదారులకు ఇతర బబుల్స్‌ ఉండనున్నాయి. స్థానిక నిర్వహణ యంత్రాంగానికి మరో బబుల్‌ ఉండనుంది. చాలా మంది క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

దీంతో ప్రతి ప్రాంఛైజీ బబుల్‌లో ఎంత మంది ఉండాలనే నిర్దేశిత నిబంధనలు ఉన్నాయా? అనేది తేలాలి. ఐపీఎల్‌ జీసీ దీనిపై తేల్చాలి. అన్ని జట్లు దుబారు, అబుదాబి, షార్జాల మధ్య తిరగాల్సి ఉంటుంది. అప్పుడు అన్ని బబుల్స్‌ మూడు నగరాలు ప్రయాణించాలా? ప్రశ్నార్థకం.

హౌటళ్లలో ఇతర పర్యాటకులు సైతం ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటీ?. ప్రతి ప్రాంఛైజీ 80 రోజులకు పైగా యుఏఈలో ఉండనుంది. దీంతో హౌటళ్లలో బబుల్‌ నిర్వహణ, భౌతిక దూరం నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది.

యుఏఈకి చేరటం, బస ఏర్పాట్లు...

ప్రాంఛైజీల తొలి బాధ్యత జట్లను యుఏఈకి తీసుకెళ్లటం. ఆగస్టు 20, 21 లోగా యుఏఈకి వెళ్తామని ఐపీఎల్‌ జీసీకి తెలియజేశాం. నెలలుగా ఇండ్లకే పరిమితమైన క్రికెటర్లకు కనీసం 3 వారాల ప్రాక్టీస్‌ అవసరమని ప్రాంఛైజీలు భావిస్తున్నాయి.

భారత క్రికెటర్లను యుఏఈకి చేర్చటం, అక్కడ విదేశీ క్రికెటర్లతో కలిసి క్యాంప్‌ నిర్వహించటం పూర్తిగా ప్రాంఛైజీల బాధ్యత. భారత క్రికెటర్లు స్వీయ క్వారంటైన్‌లో ఉండాలని ఓ ప్రాంఛైజీ ఇప్పటికే క్రికెటర్లను కోరింది. దుబారు, షార్జా, అబుదాబిలలో ఎక్కడ ఉండాలనే విషయం తెలియటం లేదు.

ప్రాంఛైజీలు ఇప్పటికే కొన్ని హౌటళ్లను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మాంచెస్టర్‌, సౌతాంప్టన్‌, ఆడిలైడ్‌ తరహాలో యుఏఈలో స్టేడియాలకు అనుబంధ హౌటళ్లు లేవు. కొన్ని ప్రాంఛైజీలు కుటుంబ సభ్యులకు సైతం హౌటళ్లు బుక్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికీ ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నుంచి స్పష్టత అవసరం.

ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఏర్పాటు...

ఐపీఎల్‌కు మరో అతి పెద్ద సమస్య దక్షిణాఫ్రికా క్రికెటర్లు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు దూరమైనట్టే ఐపీఎల్‌కూ దూరమయ్యే ప్రమాదం ఉంది. గాయాలు, కోవిడ్‌19 సహా ఇతర కారణాలతో ఆటగాళ్ల స్థానంలో మరొకరిని తీసుకోవాలని అనుకుంటే నిబంధనలు ఏమిటీ? రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ జట్టు సభ్యులు 21. ఏబీ డివిలియర్స్‌, డెల్‌ స్టెయిన్‌, క్రిస్‌ మోరీస్‌ రూపంలో ముగ్గురు సఫారీ ఆటగాళ్లు ఉన్నారు.

దక్షిణాఫ్రికా క్రికెటర్లు లీగ్‌కు దూరమైతే.. ప్రత్నామ్నాయ ఆటగాళ్ల ఎంపికలో విపరీత పోటీ నెలకొనే వీలుంది. ప్రతి ప్రాంఛైజీలో ఎనిమిది మంది విదేశీ క్రికెటర్లే ఉన్నారు. ఒకవేళ ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకోవాల్సి వస్తే, అందుకు సంబంధించిన క్వారంటైన్‌ సహా ఇతర నిబంధనలపై స్పష్టత రావాలి.

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్ల పై సందిగ్ధత...

ప్రాంఛైజీలకు మరో తలనొప్పి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ సెప్టెంబర్‌ రెండో వారంలో షెడ్యూల్‌ చేయబడింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు జట్లను సెప్టెంబర్‌ తొలి వారంలోనే క్యాంప్‌కు సిద్ధం చేసే యోచనలో ఉన్నాయి.

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లు వన్డే సిరీస్‌లో ఉండనున్నారు. సెప్టెంబర్‌ 19 ఆరంభ మ్యాచ్‌కు వీరు వస్తారనే భరోసా లేదు. ఈ సిరీస్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో ఉంటుంది కాబట్టి, ఓ బబుల్‌ నుంచి మరో బబుల్‌కు రావటం పెద్ద సమస్య కాదు. లీగ్‌ తొలి దశ మ్యాచులకు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లు హాజరు కాకుంటే, కొన్ని ప్రాంఛైజీల బలాబలాలు తారుమారు అవుతాయి.

నెట్స్‌, నెట్‌ బౌలర్ల కొరత...

సాధారణంగా అన్ని ప్రాంఛైజీలకు తమ సొంత మైదానాల్లో అదనపు నెట్‌ బౌలర్లు ఉంటారు. బయో సెక్యూర్‌ బబుల్‌ నిబంధనలతో ఇప్పుడు నెట్‌ బౌలర్లను ఏర్పాటు చేసుకోవటం సమస్యగా మారనుంది. వెస్టిండీస్‌,ఇంగ్లాండ్‌ సిరీస్‌లో జట్టులోని అదనపు ఆటగాళ్లు నెట్‌ బౌలర్లుగా పనికొచ్చారు. ఇప్పుడు ఎనిమిది జట్లకు నెట్‌ బౌలర్లను సమకూర్చటం అసాధారణమే.

ప్రాంఛైజీలు నెట్‌ బౌలర్లను ఓ పూల్‌ నుంచి ఎంచుకోవాలా? కోవిడ్‌19 పరీక్షల అనంతరం నెట్‌ బౌలర్లను బబుల్‌లో చేర్చుకోవాలా? అనేది తేలాలి. కోవిడ్‌-19 నిబంధనలతో అన్ని జట్లను ఒకే సమయంలో సాధన చేసుకునే అవకాశం లేదు. దీంతో ప్రాక్టీస్‌ సెషన్లకు సైతం పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్‌ కావాలని ప్రాంఛైజీలు కోరుతున్నాయి.

దుబాయ్‌లో రగ్బీ టోర్నీ రద్దు...

దుబాయ్‌లో జరగాల్సిన వరల్డ్‌ రగ్బీ 7 టోర్నీ రద్దు అయ్యింది. దుబారులో రోజుకు 350-400 కరోనా వైరస్‌ కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ వరల్డ్‌ రగ్బీ సెవెన్‌ సిరీస్‌ నిర్వహించటం సురక్షితం కాదని వరల్డ్‌ రగ్బీ సంఘం టోర్నీని రద్దు చేసింది.

మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో దుబారు సురక్షిత ప్రదేశమని బీసీసీఐ పదేపదే చెబుతోంది. ' అవును, రగ్బీ టోర్నీ రద్దు అయిన సంగతి మాకు తెలుసు. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డుతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ఐపీఎల్‌ 2020కి దుబారు అత్యంత సురక్షిత ప్రదేశమని ఈసీబి హామీ ఇస్తోంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios