Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాలంలో ఐపిఎల్: కఠినమైన మార్గదర్శకాలు, అవి ఇవీ...

కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సుమారు ఐదు నెలలుగా క్రికెటర్లు ఇండ్లకే పరిమితం అయ్యారు. మార్చి ఆరంభం నుంచే క్రికెటర్లు సాధనకు దూరమయ్యారు. ఇప్పుడు ఐపీఎల్‌కు అధికారిక గ్రీన్‌ సిగల్‌ రావటంతో, లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ల సాధనకు అనుమతులు అడ్డుగా నిలుస్తున్నాయి. 

IPL2020 : In The Wake Of COVID Guidelines, Teams Await To Practice
Author
Mumbai, First Published Aug 12, 2020, 4:38 PM IST

రాజస్థాన్‌ రాయల్స్‌ ఆగస్టు 20. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌లు ఆగస్టు 21. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆగస్టు 22. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఆగస్టు 23న!. ఇదీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కోసం ప్రాంఛైజీలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)కు బయల్దేరే షెడ్యూల్‌. 

దేశవాళీ టోర్నీలను విదేశాల్లో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరి. కేంద్ర హౌం శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖలు యుఏఈలో ఐపీఎల్‌కు సోమవారం లిఖితపూర్వక అనుమతులు ఇచ్చాయి. 

ఈ విషయాన్ని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. ప్రభుత్వ అనుమతుల రాకతో ప్రాంఛైజీలు యుఏఈ ప్రణాళికల్లో నిమగమయ్యాయి. భారత ప్రభుత్వ అనుమతుల రాకతో, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అధికారికంగా యుఏఈ ప్రభుత్వాన్ని, స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించేందుకు సిద్ధమవుతోంది. 

ఐపీఎల్‌ 13 సీజన్‌ యుఏఈలో జరుగుతుందని ముందే తెలిసినా, పూర్తి స్థాయి షెడ్యూల్‌ రావాల్సి ఉంది. యుఏఈలో ఐపీఎల్‌కు ప్రాంఛైజీలు భిన్న విధాలుగా సిద్ధమవుతున్నాయి. కొన్ని ప్రాంఛైజీలు క్రికెటర్లకు క్యాంప్‌ నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తుండగా, మరికొన్ని ప్రాంఛైజీలు ఇక్కడే వారం రోజుల క్వారంటైన్‌కు ఏర్పాట్లు చేస్తున్నాయి. మరికొన్ని ప్రాంఛైజీలు నేరుగా యుఏఈకి బయల్దేరేందుకు సిద్ధపడుతున్నాయి. యుఏఈలో ఐపీఎల్‌కు ప్రాంఛైజీలు, బీసీసీఐ సన్నాహాకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

అనుమతిస్తే ఇక్కడే సాధన షురూ..!

కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సుమారు ఐదు నెలలుగా క్రికెటర్లు ఇండ్లకే పరిమితం అయ్యారు. మార్చి ఆరంభం నుంచే క్రికెటర్లు సాధనకు దూరమయ్యారు. ఇప్పుడు ఐపీఎల్‌కు అధికారిక గ్రీన్‌ సిగల్‌ రావటంతో, లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ల సాధనకు అనుమతులు అడ్డుగా నిలుస్తున్నాయి. 

అన్‌లాక్‌ ప్రక్రియలో కొన్ని రాష్ట్రాలు సాధనకు అనుమతులు ఇవ్వగా, మరికొన్ని రాష్ట్రాలు పరిస్థితులకు అనుగుణంగా నిరాకరిస్తున్నాయి. వాంఖడే స్టేడియంలో వార్మప్‌తో పాటు ఇండోర్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌కు అనుమతి ఇవ్వాలని స్టార్‌ క్రికెటర్‌ అజింక్య రహానె ఇటీవల ముంబయి క్రికెట్‌ సంఘానికి విజ్ఞప్తి చేశాడు. 

ముంబయిలో టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, షార్దుల్‌ ఠాకూర్‌, పృథ్వీ షా సహా ఇతర క్రికెటర్లు నివాసం ఉంటున్నార. ఎంసీఏ నుంచి అనుమతులు లభిస్తే వీరంతా వాంఖడే, ఇండోర్‌ స్టేడియంలో సాధనకు రానున్నారు. 

క్రికెటర్ల విజ్ఞప్తితో మహరాష్ట్ర ప్రభుత్వం తలుపు తట్టిన ఎంసీఏ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వ అనుమతులు లభిస్తే, క్రికెటర్లు స్టేడియాల్లో సాధన చేసేందుకు అవకాశం ఉంది. ఎం.ఎస్‌ ధోని సూచనల మేరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 15 మంది భారత క్రికెటర్లతో చెపాక్‌ స్టేడియంలో ఐదు రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. తమిళనాడు క్రికెట్‌ సంఘం (టిఎన్‌సీఏ) అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.

ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లోకి అడుగుపెట్టేందుకు బీసీసీఐ స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. యుఏఈ విమానం ఎక్కడానికి ముందు 24 గంటల వ్యవధిలో రెండు సార్లు కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా రావాలి. 

యుఏఈలోకి అడుగుపెట్టిన తర్వాత వారం రోజు ల క్వారంటైన్‌లో మూడుసార్లు (1,3,6 రోజు ల్లో) కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటి వ్‌గా రావాలి. అప్పుడే ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లోకి ప్రవేశించాలి. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ (ఆర్‌సీబీ) బెంగళూర్‌లోనే వారం రోజుల క్వారంటైన్‌కు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం క్రికెటర్లను ఆగస్టు 16-17న నగరానికి రప్పించనుంది. 

ముంబయి ఇండియన్స్‌ ప్రాంఛైజీ ఇప్పటికే కోవిడ్‌19 పరీక్షల దశను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలింగ్‌ కోచ్‌ జహీర్‌ ఖాన్‌లు ముంబయి ఇండియన్స్‌ ఏర్పాటు చేసిన వసతిలో టెస్టులు చేయించుకున్నట్టు సమాచారం. యుఏఈ బయల్దేరడానికి ముందు క్రికెటర్ల క్యాంప్‌, క్వారంటైన్‌పై ముంబయి ఇండియన్స్‌ నుంచి స్పష్టత లేదు.

డైరెక్ట్ దుబాయికే..!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌లు నేరుగా యుఏఈకి వెళ్లనున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారత్‌లో ఎటువంటి ప్రణాళికలు చేయలేదు. ఆగస్టు 23న సన్‌రైజర్స్‌ చెన్నై లేదా హైదరాబాద్‌ నుంచి యుఏఈకి వెళ్లనుంది. 

కోల్‌కత నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పరిస్థితి అటు ఇటుగా ఇలాగే ఉంది. కనీసం మూడు రోజులు స్టార్‌ హౌటల్లో క్వారంటైన్‌లో ఉంచి కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయనున్నారు. నెగెటివ్‌ వచ్చిన క్రికెటర్లతో ప్రత్యేక విమానంలో ప్రాంఛైజీలు యుఏఈకి బయల్దేరనున్నాయి.  

ఐపీఎల్‌ ఆతిథ్య దేశం, ఆతిథ్య నగరాలు, తేదీలు ఎప్పుడో ఖరారు అయ్యాయి. భారత ప్రభుత్వ అనుమతులూ వచ్చేశాయి. అయినా, ఐపీఎల్‌ పూర్తి స్థాయి షెడ్యూల్‌ ఇంకా రాలేదు. 

సాధారణంగా 40-45 రోజులకు ముందే ఐపీఎల్‌ పూర్తి స్థాయి షెడ్యూల్‌ విడుదల చేస్తారు. దీంతో ప్రాంఛైజీలు లాజిస్టికల్‌ ఏర్పాట్లు చేసుకుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి షెడ్యూల్‌కు మరో వారం రోజులు పట్టనుందని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ అన్నాడు. 

దుబాయి, అబుదాబి, షార్జా వేదికల్లో రెక్కీ నిర్వహించిన అనంతరం తుది షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. ప్రాంఛైజీలు యుఏఈకి బయల్దేరడానికి ముందే పూర్తి స్థాయి షెడ్యూల్‌ విడుదల చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios