ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13 సీజన్‌ యుఏఈలో జరుగనుంది. త్వరలోనే ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ అధికారికంగా ఈవిషయాన్ని వెల్లడించనుంది. 51 రోజుల్లో 60 మ్యాచుల నిర్వహణకు బీసీసీఐ షెడ్యూల్‌ రూపకల్పన చేసింది. 

దుబాయి, షార్జా, అబుదాబి స్టేడియాలు ఐపీఎల్‌2020కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. యుఏఈలో క్రికెట్‌ మ్యాచులకు ఫిక్సింగ్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గతంలో బీసీసీఐ పేర్కొనగా.. ఇప్పుడు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ భిన్నమైన అభిప్రాయం వెల్లడించాడు. 

2013లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దావూద్ గ్యాంగ్ కి చెందిన సభ్యులు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వారంతా దుబాయ్ నుండే ఈ తతంగాన్ని నడిపించారు. అప్పుడు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో అందరికి తెలిసిన అంశమే. ఆ దెబ్బకు ఏకంగా రెండు జెట్లే నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. 

'ఐపీఎల్‌ యుఏఈలో మూడు వేదికల్లో జరుగుతుంది. భారత్‌లో ఎనిమిది నగరాల్లో జరిగేది. మూడు వేదికల్లో అవినీతి నిరోధక మానిటరింగ్‌ సులువు కానుంది. తుది షెడ్యూల్‌ వచ్చిన తర్వాత పని కార్యాచరణ రూపొందిస్తాం. ఏ విధమైన బయో సెక్యూరిటీ విధానాలను రూపొందిస్తామో ఇప్పుడే చెప్పటం పొరపాటు అవుతుంది. 

అక్కడ ఏసీయూకి మరింత సిబ్బంది అవసరం అని భావిస్తే యుఏఈలోనే నియమించుకుంటాం. ఓ ప్రయివేట్‌ లీగ్‌కు ఏసీయూ అధికారుల అవసరం కోసం ఐసీసీని సంప్రదిస్తే, వారు అందుకు అంగీకరిస్తే అందుకు అయ్యే ఖర్చును భరిస్తే సరిపోతుంది. బుకీలు, ఫిక్సర్లు అందరూ ఇంటర్‌ కనెక్టింగ్‌ వ్యవస్థ. మా వద్ద సమాచారం ఉంటే, వారు ఏ విధంగా పనిచేస్తారనే విషయం కూడా తెలుస్తుంది. ఐపీఎల్‌ తుది షెడ్యూల్‌, వేదిక ఖరారు అయిన తర్వాత ఏసీయూ ప్రణాళిక రూపొందిస్తాం' అని అజిత్‌ సింగ్‌ తెలిపాడు.

దుబాయిలో మ్యాచ్ ఫిక్సింగ్ కి అవకాశాలు ఎక్కువ అని  ఇప్పటికే బీసీసీఐ సహా అనేక క్రికెట్ బోర్డులు గతంలో వ్యాఖ్యలు చేసాయి. అక్కడ క్రికెట్ బుకీలు, ఫిక్సర్లు ఇతరులు అంతా కూడా ఒక నెట్వర్క్ గా అక్కడ పని చేస్తారు. దాన్ని ఇప్పుడు బీసీసీఐ ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాలి. 

ఇకపోతే... మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 8 ఫైనల్‌తో నూతన షెడ్యూల్‌ బీసీసీఐ రూపొందించిందన్న విషయం విదితమే. 

యూఏఈ ఎందుకంటే..?

ఐపీఎల్‌ 13 సీజన్‌ మార్చి 29-మే 24న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా తొలుత ఏప్రిల్‌ 15కు, తర్వాత నిరవధిక వాయిదా పడింది. అప్పట్నుంచి ఐసీసీ, ఏసీసీ టోర్నీలు వాయిదా పడేందుకు బీసీసీఐ ఎదురుచూసింది. దీంతో ఐపీఎల్‌ నిర్వహణకు 8 వారాల సమయం లభించింది. 

యుఏఈలో మూడు స్టేడియాల్లో ఐపీఎల్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. షేక్‌ జయేద్‌ క్రికెట్‌ స్టేడియం, అబుదాబి, దుబాయి, షార్జాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు స్టేడియాలను అద్దెకు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఐసీసీ అకాడమీకి సైతం బోర్డు అద్దెకు తీసుకునే యోచనలో ఉంది. యుఏఈ ప్రభుత్వం అనుమతిస్తే, అభిమానులను సైతం పరిమిత సంఖ్యలో అనుమతించే అవకాశం లేకపోలేదు.

గత వారంలో యుఏఈ రోజువారీ నూతన కోవిడ్‌-19 కేసులు 300 కన్నా తక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క అంశంలో భారత్‌ కంటే యుఏఈ సురక్షితమనే భరోసా ఇస్తోంది. అదే భారత్‌లో రోజువారీ కేసులు 40000కు చేరువగా ఉన్నాయి. 

ఇదే సమయంలో యుఏఈ జులై 7 నుంచి పర్యాటకం కోసం దేశ సరిహద్దులను తెరిచింది. యుఏఈలోకి అడుగుపెట్టే వారికి కచ్చితమైన 15 రోజుల క్వారంటైన్‌ నిబంధనలు లేవు. కోవిడ్‌-19 నెగెటివ్‌ రిపోర్టు చూపితే సరిపోతుంది. 

ఈ నిబంధనలు ప్రాంఛైజీలకు అనుకూలంగా ఉన్నాయి. క్రికెటర్ల క్యాంప్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు ఆఖర్లో యుఏఈకి బయల్దేరినా మూడు వారాలకు తగ్గకుండా ప్రాక్టీస్‌ చేసేందుకు అవకాశం ఉంది. సెప్టెంబర్‌ తొలి వారంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు యుఏఈకి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.