Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ, చెన్నైలకు గాయాల దెబ్బ, కీ ప్లేయర్స్ అవుట్, ధోని పై ఫోకస్

ఎం.ఎస్‌ ధోని నం.5లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సూపర్‌కింగ్స్‌ గెలుపు శాతం 57గా ఉండగా, నం.6, నం.7లో బ్యాటింగ్‌కు వస్తే గెలుపు శాతం 37 కంటే దిగువకు వస్తుంది. దీంతో నేడు క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎం.ఎస్‌ ధోని బ్యాటింగ్‌ పొజిషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

IPL2020 : CSK VS DC Match preview, Injury Plagued Teams, Can Dhoni Silence Critics..?
Author
Dubai - United Arab Emirates, First Published Sep 25, 2020, 9:14 AM IST

అతడు క్రికెట్‌కు దూరంగా ఉన్నా, భారత క్రికెట్‌ జట్టుకు 12 నెలలుగా పైగా దూరమైనా విశ్లేషకులు, అభిమానుల ఫోకస్‌ ఎప్పుడూ ఎం.ఎస్‌ ధోనిపైనే ఉన్నది. గత కొంత కాలంగా రిటైర్‌మెంట్‌, టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటుపై విస్తృత చర్చ నడిచింది. 

ఇప్పుడు మాత్రం ఎం.ఎస్‌ ధోని నుంచి ఫోకస్‌ ఎందుకు పక్కకు తప్పుకుంటుంది? రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌పై  విమర్శలు రేగిన సంగతి తెలిసిందే. అటువంటి చర్చకు, విమర్శలకు ధోని సహజంగానే స్పందించడు.  

కానీ ఎం.ఎస్‌ ధోని నం.5లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సూపర్‌కింగ్స్‌ గెలుపు శాతం 57గా ఉండగా, నం.6, నం.7లో బ్యాటింగ్‌కు వస్తే గెలుపు శాతం 37 కంటే దిగువకు వస్తుంది. దీంతో నేడు క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎం.ఎస్‌ ధోని బ్యాటింగ్‌ పొజిషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

దుబాయ్‌ క్రికెట్‌ స్టేడియంలో నేడు రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది.

ధోనీసేన పుంజుకుంటుందా?..

బలమైన ముంబయి ఇండియన్స్‌పై తొలి విజయం. జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌ లేని రాజస్థాన్‌పై గెలుపు నల్లేరుమీద నడకే అనుకున్నారు. కానీ సంజూ శాంసన్‌ ధోనీసేన వ్యూహలకు చిక్కలేదు.  ఫలితంగా చెన్నైకి ఓటమి తప్పలేదు. 

బ్యాటింగ్‌ లైనప్‌ డుప్లెసిస్‌, శామ్‌ కరన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. షేన్‌ వాట్సన్‌ తన స్థానానికి న్యాయం చేయాల్సి ఉంది. రుతురాజ్‌ గైక్వాడ్‌, కేదార్‌ జాదవ్‌లు సత్తా చాటితే చెన్నైకి తిరుగుండదు. దీపక్‌ చాహర్‌కు నేడు షార్దుల్‌ ఠాకూర్‌ తోడు కానున్నాడు. పియాశ్‌ చావ్లా, లుంగి ఎంగిడిలు ఢిల్లీ స్టార్‌ బ్యాటర్లను డగౌట్‌కు చేర్చేందుకు తగిన అస్త్రాలతో రెఢీగా ఉన్నారు.

యువోత్సాహం..

ఢిల్లీ క్యాపిటల్స్‌ శిబిరం యువోత్సాహంతో కదం తొక్కుతుంది.  దేశవాళీ యువ బ్యాట్స్‌మన్‌, వరల్డ్‌ క్లాస్‌ పేసర్లతో ఢిల్లీ ధీమాగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లు నిరాశపరిచారు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా పరుగుల వేటలో దూసుకెళ్లేవారే.  

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌లు ఫామ్‌లో ఉన్నారు. మార్కస్‌ స్టోయినిస్‌ తొలి మ్యాచ్‌ భీకర ప్రదర్శనను చెన్నైపైనా పునరావృతం చేయాలని చూస్తున్నాడు. కగిసో రబాడ, ఎన్రిచ్‌ నొర్జ్టె, మోహిత్‌ శర్మలతో పేస్‌ విభాగం బాగుంది. అక్షర్‌ పటేల్‌తో అమిత్‌ మిశ్రా స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.

ఇంజూరీ రిపోర్టు..

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో చెలరేగిన అంబటి రాయడు తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు.  చెన్నై స్టార్‌ ఆల్‌రౌండర్‌ డారెన్‌ బ్రావో మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ ఇద్దరు నేడు సెలక్షన్‌కు అందుబాటులో లేరు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఘనంగా అరంగేట్రం చేసిన ట్రంప్‌కార్డ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ భుజం గాయం నుంచి కోలుకుంటున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో రెండు వికెట్లు కూల్చిన అశ్విన్‌, అదే ఓవర్‌లో భుజం గాయంతో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. నేడు మ్యాచ్‌కు అశ్విన్‌ అందుబాటులో లేడు. అమిత్‌ మిశ్రా అందుబాటులో లేడు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

చెన్నై సూపర్‌కింగ్స్... షేన్‌ వాట్సన్‌ , డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శామ్‌ కరన్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), దీపక్‌ చాహర్‌, షార్దుల్‌ ఠాకూర్‌, పియూశ్‌ చావ్లా, లుంగి ఎంగిడి/ఇమ్రాన్‌ తాహీర్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌... పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, షిమ్రోన్‌ హెట్మయర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్, అమిత్‌ మిశ్రా, ఎన్రిచ్‌ నొర్ట్జె, మోహిత్‌ శర్మ.

Follow Us:
Download App:
  • android
  • ios