IPL Media Rights: ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడల్లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఒకటి. దానికున్న క్రేజ్, విలువ పరంగా ప్రపంచంలో నిన్నటివరకు అది టాప్-2 లీగ్ గా ఉండేది. కానీ.. 

పదిహేనేండ్లు.. గట్టిగా చెప్పాలంటే భారత్ లో ఈ వయసున్నవాళ్లకు ఇంకా ఓటు హక్కు కూడా ఇవ్వరు. కానీ ఈ 15 ఏండ్ల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలో తోపు క్రీడా లీగ్ లకు సవాల్ విసురుతున్నది. ఐపీఎల్ కంటే చాలా సంవత్సరాలు ముందుపుట్టి అశేష జనాధరణతో ఎప్పటికప్పుడూ తమ విలువను పెంచుకుంటూ పోతున్న దిగ్గజ క్రీడా లీగ్ లకు మేడిన్ ఇండియా టీ20 క్రికెట్ లీగ్ షాకులిస్తున్నది. దిగ్గజ లీగ్స్ అన్నింటికీ నేనొస్తున్నానంటూ సవాల్ చేస్తున్నది. 

ప్రపంచంలో ఫుట్బాల్ తో పోల్చితే క్రికెట్ ఆడే దేశాలు చాలా పరిమితం. ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లో ఫుట్బాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికే ఇంగ్లాండ్ లో పుట్టింది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇప్పుడు ఈ లీగ్ ను ఐపీఎల్ అధిగమిచింది. 

ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్.. ఈపీఎల్ ను అధిగమించింది. ఈపీఎల్ లో ఒక మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా ఐపీఎల్ లో ఇది రూ. 107.5 కోట్లు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు). గతంలో ఐపీఎల్ లో ఒక మ్యాచ్ విలువ రూ. 54 కోట్లు మాత్రమే ఉండేది. మీడియా హక్కుల వేలం ద్వారా ఈ విలువ ఎకాఎకి రెట్టింపు అయింది. 

ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న లివర్ పూల్ ఫుట్బాల్ క్లబ్, మాంచెస్టర్ యూనైటైడ్ ఎఫ్.సి, మాంచెస్టర్ సిటీ ఎఫ్.సి, ఛలేసా ఎఫ్.సి, అర్సెనాల్ ఎఫ్.సి వంటి తోపు ఫుట్బాల్ ఫ్రాంచైజీలన్నీ ఈపీఎల్ లో జట్లుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ల తర్వాతే. 

ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్ టీవీ ప్రసారాలు (రూ. 57.5 కోట్లు), డిజిటల్ (రూ. 50 కోట్లు) హక్కులు కలిపి మొత్తంగా రూ. 107.5 కోట్లు దక్కించుకుంది. ప్రపంచంలోని టాప్-5 క్రీడా లీగ్ లలో అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఒక్కటే ఐపీఎల్ కంటే ఒక మెట్టు పైన ఉంది. ఎన్ఎఫ్ఎల్ లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు (17 యూఎస్ మిలియన్ డాలర్లు). 

ప్రపంచంలోని టాప్-5 స్పోర్ట్స్ లీగ్స్ (ఒక్కో మ్యాచ్ విలువ పరంగా)

- ఎన్ఎఫ్ఎల్ : రూ. 133 కోట్లు 
- ఐపీఎల్ : రూ. 107.5 కోట్లు 
- ఈపీఎల్ : రూ. 85 కోట్లు 
- ఎంఎల్బీ : రూ. 85 కోట్లు (మేజర్ లీగ్ బేస్ బాల్) 
- ఎన్బీఎ : రూ. 25 కోట్లు (నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్) 

Scroll to load tweet…

గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో భాగంగా నాలుగు ప్యాకేజీలకు సాగుతున్న ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఎ,బి ప్యాకేజీలకు వేలం ముగియగా మంగళవారం ‘సి’ ప్యాకేజీకి వేలం సాగుతున్నది. ఈ మూడింటికి కలిపి బీసీసీఐ ఇప్పటికే రూ. 47,300 కోట్లు ఆర్జించినట్టు తెలుస్తున్నది.