కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ ఉన్న విషయం తెలిసిందే. భారతదేశం కూడా ఈ లాక్ డౌన్ ని మరో 19 రోజులపాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు విశ్వ క్రీడలే వాయిదా పడ్డాయి. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 నిరవధికంగా వాయిదా పడింది. ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. అసలు ఐపీఎల్‌ సీజన్‌ 13 ఉంటుందా? రద్దు అవుతుందా? అనే స్పష్టత ఇచ్చే స్థితిలో బీసీసీఐ పెద్దలు లేరు. 

దీంతో నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ఎనిమిది ప్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం అందించింది. ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యపడకుంటే బీసీసీఐకి రూ. 3 వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. బోర్డు సంగతి పక్కనపెడితే, క్రికెటర్లు సైతం భారీగా నష్టపోనున్నారు. 

భారత్‌ సహా ప్రపంచ క్రికెటర్లకు ఐపీఎల్‌ బంగారు గుడ్లు పెట్టే బాతు. ఐపీఎల్‌ సీజన్‌తోనే అత్యధిక పారితోషికం ఖాతాల్లో వేసుకుంటున్నారు. ప్రతి ప్రాంఛైజీ రూ. 80 కోట్ల మేర ఆటగాళ్ల వేతనాలు చెల్లించాలి. 

దీంతో ఐపీఎల్‌ రద్దు అయితే ఆటగాళ్లు రూ. 600 కోట్లు నష్టపోనున్నారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అత్యధికంగా రూ. 17 కోట్లు అందుకుంటున్నాడు. ఎం.ఎస్‌ ధోని, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌లు రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నారు. 

రూ. 10 కోట్ల పైచిలుకు తీసుకునే క్రికెటర్లు కొంత మంది ఉన్నారు. ఐపీఎల్‌ రద్దుతో ఈ మనీ మొత్తం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్‌లో అన్ని ప్రాంఛైజీలకు భారత క్రికెటర్లు 121 మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

భారత క్రికెటర్లు ఐపీఎల్‌ 13 నుంచి రూ. 358.15 కోట్లు వేతనంగా అందుకోవాల్సి ఉంది. భారత క్రికెటర్ల తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు నష్టపోనున్నారు. రూ. 86.75 కోట్లు కంగారూ క్రికెటర్లు కోల్పోవాల్సి ఉంటుంది. 

డెవిడ్‌ వార్నర్‌,పాట్‌ కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌లు రూ. 10 కోట్లకు పైచిలుకు అందుకుంటున్నారు. వెస్టిండీస్‌ క్రికెటర్లు రూ. 56.95 కోట్లు, దక్షిణాఫ్రికా క్రికెటర్లు 34.60 కోట్లు, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు రూ. 35.80 కోట్లు, అఫ్గనిస్థాన్‌ క్రికెటర్లు రూ. 10.40 కోట్లు , న్యూజిలాండ్‌ క్రికెటర్లు రూ. 15.65 కోట్లు, శ్రీలంక క్రికెటర్లు రూ. 2.20 కోట్లు నష్టపోనున్నారు.

క్రికెటర్లకు నో మ్యాచ్ నో ప్లే అనే సిద్ధాంతాన్ని బీసీసీఐ ఖచ్చితంగా పాటిస్తుండడంతో, క్రికెటర్లందరూ ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఐపీఎల్ వల్ల వారికి భారీ చిల్లు మాత్రం తప్పేలా కనిపించడం లేదు.