టీవీ ప్రసార హక్కులను తిరిగి సొంతం చేసుకున్న స్టార్ నెట్‌వర్క్ కంపెనీ... అంబానీ చేతికి డిజిటల్ రైట్స్... ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి రూ. 48 వేల కోట్ల ఆదాయం...

ఐపీఎల్ మీడియా ప్రసార హక్కులకు సంబంధించి మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సోనీ నెట్‌వర్క్, స్టార్ నెట్‌వర్క్ మధ్య జరిగిన ఉత్కంఠకర పోటీలో స్టార్ నెట్‌వర్క్ తిరిగి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకూ టీవీ ప్రసార హక్కుల కోసం బీసీసీఐకి రూ.23,575 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది స్టార్ నెట్‌వర్క్...

అలాగే డిజిటల్ రైట్స్‌ని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన వయాకామ్‌ దక్కించుకుంది. వయాకామ్‌, భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఐపీఎల్‌ను ప్రసారం చేయనుంది. ఇందుకోసం రూ.23,773 కోట్లను భారత క్రికెట్ బోర్డుకు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది వయాకామ్... అలాగే టైమ్స్ నెట్‌వర్క్ కూడా డిజిటల్ హక్కుల్లో భాగం దక్కించుకుంది...

మొత్తంగా ఐపీఎల్ 2023-27 మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి 48,390.52 కోట్ల భారీ మొత్తం బీసీసీఐ ఖాతాలో చేరింది. 2008 నుంచి 2017 వరకూ సోనీ నెట్‌వర్క్, ఐపీఎల్‌ను ప్రసారం చేయగా 2018లో తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులు స్టార్ నెట్‌వర్క్ చేతుల్లోకి వెళ్లాయి. ఈసారి తిరిగి సోనీ, ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకుందని తెగ ప్రచారం జరిగినా స్టార్ నెట్‌వర్క్ అంతకంతకూ రేటు పెంచుతూ పోయి, రైట్స్‌ని తిరిగి కొనుగోలు చేసింది... 

Scroll to load tweet…


వయాకామ్,డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమేజాన్‌, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు... ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి... 

అయితే వయాకామ్, అమేజాన్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు, ఐపీఎల్ మీడియా బిడ్డింగ్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐకి నిరాశ తప్పదేమో అనుకున్నారంతా. అయితే స్టార్ స్పోర్స్, సోనీ నెట్‌వర్క్ కలిసి బిడ్డింగ్ పెంచుతూ పోయాయి.

ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ని దక్కించుకున్న వయాకామ్ 18కి చెందిన వూట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారం కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవానికి ఐపీఎల్ ప్రసారాల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను త్వరగా తీసుకోరాబోతోంది వయాకామ్. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ స్థాయిలో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, అందుకు ఐపీఎల్‌ ప్రసార హక్కుల విక్రయాలను వాడుకోనుంది...

జియో టీవీ సేవలను ఉచితంగా అందిస్తున్న రిలయన్స్ నెట్‌వర్క్, కొత్తగా తీసుకురాబోయే ఓటీటీ యాప్‌‌కి మాత్రం భారీగా ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇన్నాళ్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ చెల్లించడానికే తెగ ఇబ్బంది పడిన ఐపీఎల్ ఫ్యాన్స్, అంబానీ కంపెనీ బాదుడుని తట్టుకుని మ్యాచులను చూస్తారా? అనేది చూడాల్సి ఉంది.