ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో విదేశీ కంపెనీల స్పాన్సర్‌షిప్‌ల సమీక్షకు సమావేశం కావాల్సిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగస్టు 1న భేటీ కానుంది. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ యుఏఈలో జరుగుతుందని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ఇదివరకే ప్రకటించారు. 

ఐపీఎల్‌ ఆతిథ్యానికి బీసీసీఐ నుంచి సూత్రప్రాయ అంగీకార లేఖ సైతం అందిందని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసిబి) సైతం వెల్లడించింది. విదేశాల్లో ఐపీఎల్‌ నిర్వహణకు, క్రికెటర్లు యుఏఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. 

ఇవి కాకుండా, పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ ఆగస్టు 1న వర్చువల్‌ సమావేశం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ మూడు వేదికల్లో 51 రోజుల పాటు జరుగనున్న సంగతి తెలిసిందే. 

తుది షెడ్యూల్‌ ఖరారు, వేదికలు, శిక్షణ సౌకర్యాలు, క్వారంటైన్‌ నిబంధనలు సహా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపీ)లపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రధానంగా చర్చించనుంది. సెప్టెంబర్‌ 19-నవంబర్‌ 8 షెడ్యూల్‌ను బ్రిజేశ్‌ పటేల్‌ ఇదివరకే ప్రకటించారు. 

దుబాయి, షార్జా, అబుదాబి స్టేడియాల్లో ఐపీఎల్‌ జరుగనుంది. దీనికి తోడు ఎనిమిది జట్ల ప్రాక్టీస్‌కు వీలుగా ఐసీసీ నెట్‌ ప్రాక్టీస్‌ సెంటర్‌ను సైతం అద్దెకు తీసుకునే యోచనలో భారత బోర్డు ఉంది. నూతన రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం పూర్తి చేసుకున్న అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ (జులై 27), జై షా (జూన్‌ 30)లు సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నారు.