NBA & NFL Stars Invest in RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నానాటికీ దాని బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్నది. ఇప్పటికే ఈ లీగ్ పై బడా మల్టీనేషనల్ కంపెనీలు కన్నేయగా తాజాగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు.
నానాటికీ తరగని ఆదరణతో విశ్వవ్యాప్తంగా ఆదరణను చురగొంటున్న ఐపీఎల్ ఇక ఎంతమాత్రమూ భారతదేశానికి పరిమితం కాదు. బడా సంస్థలే కాదు.. అంతర్జాతీయంగా పేరు పొందిన ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఈ లీగ్ లో భాగమవుతున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్), నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఎల్) లు ఆడే స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ లోని ప్రముఖ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఎన్ఎఫ్ఎల్ దిగ్గజాలు లారీ ఫిట్జెరాల్డ్, స్టార్ ప్లేయర్ కెల్విన్ బీచుమ్ తో పాటు ఎన్బీఏ స్టార్ క్రిస్ పాల్ రాజస్తాన్ రాయల్స్ లో పెట్టుబడులు పెట్టినట్టు స్వయంగా ఆ ఫ్రాంచైజీయే ప్రకటించింది.
ఆదివారం ట్విటర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ స్పందిస్తూ.. ‘అమెరికాకు చెందిన స్టార్ అథ్లెట్లు క్రిస్ పాల్, ఫిట్జెరాల్డ్, కెల్విన్‌లను పెట్టుబడులు పెట్టేలా మా ఫ్రాంచైజీ ఆకర్షించింది. ఈ ముగ్గురు మా స్టేక్ హోల్డర్ల జాబితాలో చేరారు... వారికి స్వాగతం..’ అని ప్రకటించింది.
కాగా.. ఐపీఎల్ లో తొలి సీజన్ విజేతగా నిలిచిన రాజస్తాన్ మళ్లీ చాలా కాలానికి ఈ సీజన్ లో అదరగొడుతున్నది. ఆడిన 9 మ్యాచుల్లో 6 మ్యాచులు గెలిచి మూడింటిలో ఓడి.. 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న ఆ జట్టు.. ఈసారి టైటిల్ ఫేవరైట్ గా కూడా ఉంది. ఆరెంజ్ క్యాప్ (జోస్ బట్లర్), పర్పుల్ క్యాప్ (యుజ్వేంద్ర చాహల్) కూడా వాళ్ల దగ్గరే ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టును భవిష్యత్ లో గ్లోబల్ లెవల్ లో ఓ ప్రొఫెషనల్ ఫ్రాంచైజీగా మార్చాలని రాజస్తాన్ రాయల్స్ తెలిపింది.
మనోజ్ బదాలే కు చెందిన ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ రాజస్తాన్ రాయల్స్ కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. అమెరికన్ స్టార్ ఆటగాళ్లు తమతో భాగమవడం సంతోషంగా ఉందన్నారు బదాలే. తాజాగా అమెరికన్ ఆటగాళ్ల పెట్టుబడులతో తమ ఫ్రాంచైజీ విశ్వవ్యాప్తంగా ఒక బ్రాండ్ సంపాదించుకుందని, దీనిని ఓ ప్రొఫెషనల్ ఫ్రాంచైజీకి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వరల్డ్ ఫేమస్ స్టార్లు తమ జట్టులో భాగమైనందుకు తమకు మేలే జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఇక రాజస్తాన్ లో పెట్టుబడుల పెట్టిన ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్ స్టార్లు మాట్లాడుతూ.. ఐపీఎల్ ఎంతగా ఎదిగిందో అందరికీ తెలుసునని, విలువ పరంగా నానాటికీ వృద్ధి చెందుతున్న ఈ లీగ్ లో భాగమవడం సంతోషంగా ఉందని తెలిపారు. వీళ్లే గాక అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ కంపెనీలు కూడా రాజస్తాన్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నాయి.
ఇదిలాఉండగా.. సోమవారం రాత్రి రాజస్తాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. మూడు రోజుల క్రితం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తక్కువ స్కోరుకే ఔటై ఓటమి పాలైన రాజస్తాన్ ఈ మ్యాచ్ లో నెగ్గి తిరిగి పాయింట్ల పట్టికలో టాప్-2కు చేరాలని భావిస్తున్నది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టంగా ఉన్క కేకేఆర్ ఈ మ్యాచ్ కూడా ఓడితే ఇక తర్వాత ఆడే మ్యాచులన్నీ నామమాత్రమే కానున్నాయి.
