ఐపీఎల్ 2021కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నీ ఫ్రాంచైజీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. అయితే గాయాల బెడద ఆయా జట్ల యాజమాన్యాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

ఐపీఎల్ 2021కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నీ ఫ్రాంచైజీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. అయితే గాయాల బెడద ఆయా జట్ల యాజమాన్యాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య పూణేలో జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. వీరిలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌, సామ్‌ బిల్లింగ్స్‌ ‌లు వున్నారు.

వీరు తర్వాతి మ్యాచ్‌కి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. అలాగే ఈ నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు ఐపీఎల్‌లోని ప్రధాన జట్లకు సారథ్యం వహిస్తున్న వాళ్లు కావడంతో ఇటు బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి.

ఢిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌, గత సీజన్‌ రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయస్‌ అయ్యర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఇయాన్‌ మోర్గాన్‌ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ మోచేతి గాయం కారణంగా వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌ తొలి అర్థభాగానికి దూరమయ్యాడు.

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఇరు జట్లలోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ జట్లలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య త్వరలో జరగబోయే రెండు వన్డేల్లో ఎవరూ గాయాల బారిన పడకూడదని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి. 

మరోవైపు ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించాలంటే వారం రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. ఏప్రిల్‌ 9 న ప్రారంభం కాబోయే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.