IPL Auction 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాతి సీజన్ కోసం వచ్చే నెలలో మెగా వేలం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్ల వేట మొదలెట్టాయి. భారత్ తో పాటు శ్రీలంక, ఆసీస్ లో జరుగుతున్న కీలక టోర్నీలపై దృష్టి సారించాయి.
త్వరలో ఐపీఎల్ మెగా వేలం జరుగనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్-15 కోసం జనవరి మూడో వారంలో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే తాము నిలుపుకోబోయే ఆటగాళ్ల జాబితాను 8 జట్లు ప్రకటించాయి. అయితే ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త ఫ్రాంచైజీ (లక్నో, అహ్మదాబాద్) లు రానున్న నేపథ్యంలో వేలం ఇంకా రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాల కోసం జట్లన్నీ మేధో మదనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ తమకు యువ ఆటగాళ్ల గురించి సమాచారం అందించే.. స్కౌట్స్ కు ప్రత్యేక పని అప్పజెప్పాయి.
ఇండియాలో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ, శ్రీలంకలో నిర్వహిస్తున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) తో పాటు ఆస్ట్రేలియాలో నడుస్తున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) మీద కన్నేసి ఉంచాలని ఆయా ఫ్రాంచైజీలు స్కౌట్స్ ను ఆదేశించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆయా ప్రతినిధులు.. మూడు దేశాల చుట్టూ తీరికలేకుండా యువ ఆటగాళ్ల కోసం గాలిస్తున్నారు. భారీ హిట్టింగ్ లు చేస్తూమ్యాచులను గెలిపించే హిట్టర్లు.. ఒకే ఓవర్ లో వికెట్లు తీసి మ్యాచ్ గతిని మార్చే బౌలర్ల కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్లను వెతికి పట్టుకుని వారిని దక్కించుకునేలా ప్రణాళికలు రచించాలని ఫ్రాంచైజీలు వారికి సూచిస్తున్నాయి.
ఇదే విషయమై ఓ స్కౌట్ మాట్లాడుతూ.. ‘రిటెన్షన్ లో నలుగురు ఆటగాళ్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో జట్లన్నీ కొత్త ఆటగాళ్ల కోసం చూస్తున్నాయి. బాగా ఆడే ఆటగాళ్లను వేలంలోకి తెచ్చేందుకు గాను మేము విజయ్ హాజారే, బీబీఎల్, ఎల్పీఎల్ పై దృష్టి సారించాం. అయితే భారత్, శ్రీలంకలో రెండు ట్రోఫీలను దగ్గరగా పరిశీలిస్తున్నా.. ఆసీస్ లో జరుగుతున్న బీబీఎల్ లీగ్ ను మాత్రం టీవీలలోనే వీక్షించాల్సి వస్తున్నది. అక్కడ కరోనా నిబంధనలను కఠినతరంగా ఉన్నాయి. దీంతో మేము అక్కడి వేగులతో పాటు టీవీలలో కొత్త ఆటగాళ్లను పట్టుకుంటున్నాం. ఈ నెల రోజులు మాకు అత్యంత కీలకం.’ అని తెలిపాడు.
దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టిన వారికి ఐపీఎల్ ఒక చక్కటి వేదిక అవుతున్నది. ఇలా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు ఇవాళ భారత క్రికెట్ లో కూడా ఆడుతున్నారు. విజయ్ హజారే ట్రోపీ ద్వారానే వెలుగులోకి వచ్చిన పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ లు ఇవాళ టీమిండియాలో స్టార్ ఆటగాళ్లుగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్, ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా విజయ్ హజారే నుంచి వచ్చినోళ్లో. ఇక ముంబై ఇండియన్స్ తరఫున ఆడి.. ఆ తర్వాత టీమిండియా ప్రధాన బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా కూడా ఇలా వచ్చినవాడే.
బీబీఎల్ లో ఫాస్ట్ బౌలర్లకు కొదవలేదు. రిలే మెరిడిత్, జై రిచర్డ్సన్ వంటి వాల్లు బీబీఎల్ లో మెరిసి ఐపీఎల్ లో అదరగొట్టాలని చూస్తున్నారు.
లంక ప్రీమియర్ లీగ్ నుంచి కూడా పలువురు నాణ్యమైన ఆటగాళ్లు వస్తున్నారు. ఇప్పటికే ఆర్సీబీకి ఆడుతున్న వనిందు హసరంగ, దుష్మంత చమీరలు ఎల్పీల్ లో మెరిసినోళ్లే. తాజాగా జాఫ్నా కింగ్స్ తరఫున ఆడుతున్న సిక్సర్ల వీరుడు అవిష్క ఫెర్నాండో మీద కూడా ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడింది.
