Asianet News TeluguAsianet News Telugu

IPL 2023: రింకూ సింగ్ సిక్సర్ల మోత... కోల్‌కత్తా థ్రిల్లింగ్ విక్టరీ... రషీద్ హ్యాట్రిక్ తీసినా..

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొట్టమొదటి హ్యాట్రిక్ తీసిన రషీద్ ఖాన్... వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ!  ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది, కేకేఆర్‌ని గెలిపించిన రింకూ సింగ్.. 

IPL 2023: Venkatesh Iyer half century, Rashid Khan hat-trick, Rinku Singh sensational knock cra
Author
First Published Apr 9, 2023, 7:24 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొట్టమొదటి హ్యాట్రిక్... డేంజరస్ బ్యాటర్లు ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ వికెట్లను కోల్పోయిన కోల్‌కత్తా... అంతే ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాలి. ఇక గెలిచేశామని రిలాక్స్ అయిపోయింది గుజరాత్ టైటాన్స్. అయితే ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది, మాన్‌స్టర్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌కి అద్భుత విజయాన్ని అందించాడు రింకూ సింగ్..  ఒకటి, రెండూ, మూడు, నాలుగు, ఐదు.. ఒకదాని వెనక ఒకటి సిక్సర్లు వెళ్తూ ఉంటే చూస్తూ ఉండిపోయారు గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్లు.. 

205 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్‌కి శుభారంభం దక్కలేదు. 12 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన రహ్మనుల్లా గుర్భాజ్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  8 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన నారాయణ్ జగదీశన్, జోషువా లిటిల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది కేకేఆర్...

ఈ దశలో కెప్టెన్ నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ కలిసి మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసిన నితీశ్ రాణా, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

గత సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన వెంకటేశ్ అయ్యర్, భారీ సిక్సర్లతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 15వ ఓవర్‌లో 4, 4, 6 బాదిన వెంకటేశ్ అయ్యర్, 17 పరుగులు రాబట్టాడు. దీంతో ఆఖరి 5 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 56 పరుగులే కావాల్సి వచ్చాయి..


40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివరి 4 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 50 పరుగులు అవసరమయ్యాయి..

17వ ఓవర్ మొదటి బంతికి ఆండ్రే రస్సెల్‌ని అవుట్ చేశాడు రషీద్ ఖాన్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న టైటాన్స్‌కి ఫలితం దక్కింది.  ఆ తర్వాతి బంతికి సునీల్ నరైన్ క్రీజులోకి వస్తూనే భారీ షాట్‌కి ప్రయత్నించి, జయంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత బంతికి శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్‌కి హ్యాట్రిక్ దక్కింది. 17వ ఓవర్‌లో కేకేఆర్‌కి 2 పరుగులే వచ్చాయి. 18వ ఓవర్‌లో 5 సింగిల్స్ మాత్రమే రావడంతో చివరి 2 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 43 పరుగులు కావాల్సి వచ్చాయి. 19వ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాదిన రింకూ సింగ్, చివరి బంతికి ఫోర్ బాదాడు. 

ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి ఓవర్ మొదటి బంతికి సింగిల్ రాగా రెండో బంతికి సిక్సర్ బాదాడు రింకూ సింగ్. మూడో బంతికి కూడా సిక్సర్ బాదిన రింకూ సింగ్, మ్యాచ్‌ని ఆసక్తికరంగా మార్చేశాడు.. చివరి 3 బంతుల్లో కేకేఆర్‌కి 16 పరుగులు కావాల్సి వచ్చాయి.నాలుగో బంతికి సిక్సర్ బాదిన రింకూ సింగ్, ఆ తర్వాత రెండు బంతుల్లోనూ రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు.

ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన లక్ష్యఛేదనలో ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు రింకూ సింగ్. ఆఖరి ఓవర్‌లో రాబట్టిన అత్యధిక పరుగులు ఇవే. ఇంతకుముందు 2016లో రైజింగ్ పూణే, చివరి ఓవర్‌లో 23 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 


అంతకుముందు విజయ్ శంకర్ సునామీ హాఫ్ సెంచరీ కారణంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 17 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, సునీల్ నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..

31 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా సునీల్ నరైన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.  8 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసిన అభినవ్ మనోహార్‌, యంగ్ బౌలర్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు... వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన సాయి సుదర్శన్, సునీల్ నరైన్ బౌలింగ్‌లో అనుకుల్‌రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 21 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విజయ్ శంకర్, 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శంకర్ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి 2 ఓవర్లలో 45 పరుగులు రాబట్టింది గుజరాత్ టైటాన్స్.. 

Follow Us:
Download App:
  • android
  • ios