ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్... థ్రిల్లింగ్ ఫైనల్లో నెగ్గి, ఐదో టైటిల్ కైవసం...
IPL 2023 Final మ్యాచ్‌లోనూ ఆఖరి బంతి వరకూ సాగిన హై డ్రామా... ధోనీ డకౌట్, ఆఖరి రెండు బంతుల్లో 6, 4 బాది మ్యాచ్‌ని ముగించిన రవీంద్ర జడేజా..

చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో ఐదో ఐపీఎల్ టైటిల్ చేరింది. వర్షం కారణంగా మూడు రోజుల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన సీఎస్‌కే, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్‌గా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2023 సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, ఫైనల్ మ్యాచ్‌లో 214 పరుగుల భారీ స్కోరు చేసినా బౌలింగ్ ఫెయిల్యూర్‌తో దాన్ని కాపాడుకోలేక.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది..
215 పరుగుల భారీ లక్ష్యఛేదనతో సీఎస్‌కే 3 బంతుల్లో 4 పరుగులు చేయగానే వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆట దాదాపు గంటన్నర పాటు ఆగిపోయింది. చివరికి 12 గంటల 10 నిమిషాలకు మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సీఎస్‌కే టార్గెట్‌ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు...
షమీ వేసిన మొదటి ఓవర్‌లో 10 పరుగులు రాగా, హార్ధిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లో 6, 4 బాది 14 పరుగులు రాబట్టాడు డివాన్ కాన్వే. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్‌లో 6,4 బాదిన రుతురాజ్ గైక్వాడ్, 4 ఓవర్లలోనే సీఎస్‌కే స్కోరుని 52 పరుగులకి చేర్చాడు..
తొలి వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ని అవుట్ చేసిన నూర్ అహ్మద్, డివాన్ కాన్వేని కూడా పెవిలియన్ చేర్చాడు..
25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన డివాన్ కాన్వే అవుట్ అయ్యే సమయానికి 7 ఓవర్లలో 78 పరుగులు చేసింది సీఎస్‌కే...
13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన అజింకా రహానే, మోహిత్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో శివమ్ దూబే వరుసగా 2 సిక్సర్లు బాదడంతో సీఎస్‌కే విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 38 పరుగులు కావాల్సి వచ్చాయి.
మెహిత్ శర్మ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా 6, 4, 6 బాదిన అంబటి రాయుడు 8 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, మొదటి బంతికి డేవిడ్ మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. దీంతో చివరి 2 ఓవర్లలో సీఎస్‌కే విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి..
మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో 8 పరుగులే వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి..
మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి సింగిల్ రాగా మూడో బంతికి కూడా ఒక్క పరుగే వచ్చింది. నాలుగో బంతికి కూడా సింగిల్ మాత్రమే రావడంతో చివరి 2 బంతుల్లో సీఎస్‌కే విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి...
ఐదో బంతికి స్ట్రైయిట్ సిక్సర్ బాదిన రవీంద్ర జడేజా, ఆఖరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. 20 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు...
39 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహార్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 పరుగులు చేసిన సాయి సుదర్శన్, పథిరాణా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..
ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించిన రషీద్ ఖాన్ డకౌట్ కాగా హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఇదే అత్యధిక స్కోరు.