టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా... సూపర్ ఫామ్‌లో కేకేఆర్! పంజాబ్ కింగ్స్‌పై బోణీ కొట్టిన ఉత్సాహంలో సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.. 

మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి బోణీ కొట్టింది. అలాగే మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడిన కేకేఆర్, వరుసగా రెండు విజయాలు అందుకుని జోరు మీదుంది..

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఆఖరి ఓవర్‌లో 31 పరుగులు రాణించి, ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన రోజే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది..

నాలుగు రోజుల గ్యాప్ తర్వాత బరిలో దిగుతున్నాయి ఈ రెండు జట్లు. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కలిసి రావచ్చు. అంతేకాకుండా వెంకటేశ్ అయ్యర్ కూడా గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌తో పాటు యంగ్ బౌలర్ సుయాశ్ శర్మ కూడా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. అయితే డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్ నుంచి మాత్రం ఇప్పటిదాకా సరైన ప్రదర్శన రాలేదు..

మరోవైపు భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ ఇప్పటిదాకా డబ్బుకు తగ్గ న్యాయం చేయలేకపోయారు. రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్‌లపై ఎక్కువగా బ్యాటింగ్ భారం పడుతోంది... అయితే వాషింగ్టన్ సుందర్ స్థానంలో నేటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మను తుది జట్టులోకి తీసుకొచ్చాడు కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్.. 

గత మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన మయాంక్ మర్కండే సెన్సేషనల్ స్పెల్‌తో చెలరేగాడు. అలాగే మార్కో జాన్సెన్ కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ కూడా అదరగొట్టారు..

అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టి నటరాజన్ భారీగా పరుగులు సమర్పించాడు. 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చిన నట్టూ, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. నట్టూ యార్కర్లతో చెలరేగితే సన్‌ ‘రైజింగ్’లో దూసుకుపోవడం పెద్ద కష్టమేమీ కాదు..

ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యంత భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, మొదటి రెండు మ్యాచుల్లో తేలిపోయినా పంజాబ్ కింగ్స్‌పై ప్రతాపం చూపించింది..

ఇప్పుడు ఐపీఎల్‌లో మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌పై మన బౌలర్లు ఎలాంటి ప్రతాపం చూపిస్తారనే ఆసక్తికరంగా మారింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసిన్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ జట్టు: రెహ్మానుల్లా గుర్భాజన్, ఎన్ జగదీశన్, నితీశ్ రాణా రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, సుయాశ్ శర్మ, లూకీ ఫర్గూసన్, వరుణ్ చక్రవర్తి