Asianet News TeluguAsianet News Telugu

స్వల్ప లక్ష్యఛేదనలో ఆరెంజ్ ఆర్మీ ఢమాల్! ఢిల్లీకి వరుసగా రెండో విజయం... సన్‌రైజర్స్‌ పని ఇక అస్సామే!

IPL 2023: 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... 5 ఓటముల తర్వాత వరుసగా రెండో విజయం.. స్వల్ప లక్ష్యఛేదనలో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ..

IPL 2023 SRH vs DC: Delhi Capitals beats Sunrisers Hyderabad in low scoring thriller CRA
Author
First Published Apr 24, 2023, 11:18 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస ఓటములకు స్వస్తి పలుకుతూ ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయం అందుకుంది. బ్యాటింగ్‌లో ఢిల్లీ బ్యాటర్లు తత్తురపాటు కనబర్చి వికెట్లు కోల్పోతే, తమకు అసలు తొందర లేదంటూ టెస్టు బ్యాటింగ్‌తో పుణ్యకాలాన్ని వృథా చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆఖరి ఓవర్లలో ఆత్రాన్ని ప్రదర్శించినా క్లాసిన్ అవుట్ కావడంతో స్వల్ప లక్ష్యఛేదనలో 7 పరుగుల తేడాతో ఓడింది...

145 పరుగుల ఈజీ టార్గెట్ కొట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ నానా తంటాలు పడింది. వరుసగా ఫెయిల్ అవుతుండడంతో ఓపెనర్లు ఇద్దరూ టెస్టు బ్యాటింగ్ చేశారు. 14 బంతులు ఆడిన హారీ బ్రూక్, 7 పరుగులు మాత్రమే చేసి ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

39 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆమన్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 21 బంతుల్లో 15 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అవుట్ కాగా 5 బంతుల్లో 5 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

5 బంతుల్లో 3 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వాషింగ్టన్ సుందర్, హెన్రీచ్ క్లాసిన్ కలిసి ఆరో వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, నోకియా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి ఆమన్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. క్లాసిన్ అవుట్ అయ్యే సమయానికి హైదరాబాద్ విజయానికి 19 పరుగులు కావాలి... అదే ఓవర్‌లో ఓ ఫోర్ బాదిన వాషింగ్టన్ సుందర్, 10 పరుగులు రాబట్టాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 13 పరుగులు కావాల్సి వచ్చాయి. 

తొలి బంతికి 2 పరుగులు రాగా రెండో బంతికి అద్భుతమైన యార్కర్ వేసిన ముకేశ్ కుమార్ పరుగులేమీ ఇవ్వలేదు. మూడో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ విజయానికి ఆఖరి 3 బంతుల్లో 10 పరుగులు కావాల్సి వచ్చాయి. సుందర్ నాలుగో బంతికి సింగిల్ తీయగా మార్కో జాన్సన్‌ కూడా సింగిల్ మాత్రమే తీయగలిగాడు. దీంతో మరో బంతి ఉండగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖరారైపోయింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. పృథ్వీ షా ప్లేస్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఫిలిప్ సాల్ట్‌, భువీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసిన్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు ఫిలిప్ సాల్ట్.  

1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్‌లో 4 ఫోర్లు బాది 19 పరుగులు రాబట్టాడు మిచెల్ మార్ష్.  15 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.  

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా 14.4 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఏకంగా 3 వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు సుందర్...

20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్, అదే ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్, ఆమన్ హకీం ఖాన్ వికెట్లను తీశాడు.  9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, సుందర్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

వస్తూనే ఫోర్ బాదిన ఆమన్ హకీం ఖాన్, ఆ తర్వాతి బంతిని కూడా గాల్లోకి లేపి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 ఓవర్లు పూర్తయిన తర్వాత 57/2 వద్ద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, వాషింగ్టన్ సుందర్ ఓవర్ తర్వాత 62/5 స్థితికి చేరుకుంది...

ఈ దశలో మనీశ్ పాండే, అక్షర్ పటేల్ కలిసి ఆరో వికెట్‌కి 59 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 34 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన అక్షర్ పటేల్‌ని భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు..

27 బంతుల్లో 2 ఫోర్లతో 34 పరుగులు చేసిన మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్ సూపర్ త్రోకి రనౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌ రెండో బంతికి ఆన్రీచ్ నోకియా కూడా రనౌట్ కాగా నాలుగో బంతికి రిపల్ పటేల్ కూడా రనౌట్ అయ్యాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios