సచిన్ టెండూల్కర్ ఫోటో, వాయిస్, పేరు వాడుతూ ఫేక్ అడ్వర్టైజ్‌మెంట్స్... నకిలీ యాడ్స్ నమ్మి, ఫేక్ వస్తువులు కొనవద్దని అభిమానులను కోరిన సచిన్ టెండూల్కర్..
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని పదేళ్లు దాటినా.. ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్... విరాట్ కోహ్లీ, ధోనీ తర్వాత అత్యధిక మొత్తం తీసుకుంటున్న క్రికెటర్‌గా ఉన్నారు..
ఈ క్రేజ్‌ని వాడుకుని కొందరు, ఫేక్ అడ్వర్టైజ్‌మెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ‘బ్యాట్ కా గ్రిప్ నికాలే...’ అంటూ ఓ యాడ్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే అందులో ఉన్నది సచిన్ టెండూల్కర్ వాయిస్ కాదు, ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ఎవరో చేసిన మిమిక్రీ.. ఇలా సచిన్ క్రేజ్‌ని వాడుకుని వైరల్ అవుతున్న ఫేక్ యాడ్స్ ఎన్నో.
ఈ ఫేక్ ప్రకటనలను రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సచిన్ టెండూల్కర్, ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచికి వెళ్లిన సచిన్ టెండూల్కర్, తన పేరు, ఫోటో, వాయిస్ వాడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ప్రకటనలను రూపొందిస్తూ, ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశారు. సచిన్ టెండూల్కర్ ఫిర్యాదుని స్వీకరించిన ముంబై పోలీస్ సైబర్ సెల్, ఐపీసీ సెక్షన్ 426, 465, 500 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపింది..
తన పేరును వాడి అమ్ముతున్న నకిలీ వస్తువులను కొని మోసపోవద్దంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు సచిన్ టెండూల్కర్.
‘పేటీఎం ఫస్ట్’, ‘బ్రిటానియా’, ‘కాస్ట్రాల్’, బజాజ్, ఎయిర్‌టెల్, బీఎండబ్ల్యూ, బూస్ట్, జిల్లెట్ గార్డ్, అవీవా, స్పిన్నీ, ఐడీబీఐ, మ్యూచువల్ ఫండ్స్, లూమినస్, అపోలో టైర్స్, ఐటీసీ సావ్‌లాన్, జియో సినిమా వంటి డజనుకి పైగా బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు సచిన్ టెండూల్కర్...
టీమిండియా తరుపున 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్, ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు, 34 వేలకు పైగా పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, 2013లో రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కి ఐకాన్‌గా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరంగ్రేటం చేశాడు.
