మ్యాచ్ నిలిచే సమయానికి 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 

భాగ్యనగరాన్ని మూడు రోజులుగా తడిపి ముద్ద చేస్తున్న వరుణుడు, ఐపీఎల్‌ని కూడా వదల్లేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి తొలి వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 30 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 11 బంతుల్లో 9 పరుగులు చేసిన అనుజ్ రావత్, కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

5 బంతుల్లో 4 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేసిన సుయాశ్ ప్రభుదేశాయ్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

Scroll to load tweet…

ఫాఫ్ డుప్లిసిస్ 36 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనితో పాటు దినేశ్ కార్తీక్ 3 బంతుల్లో సింగిల్ తీసి క్రీజులో ఉన్నాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులే చేసింది ఆర్‌సీబీ. ఐపీఎల్ 2023 సీజన్‌లో పవర్ ప్లేలో ఆర్‌సీబీకి ఇదే అత్యల్ప స్కోరు...

లక్నో పిచ్ మీద ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ లో స్కోరింగ్ గేమ్‌లుగా మిగిలాయి. మ్యాచ్‌లో ఇంకా 4.4 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్‌లో కూడా 140+ స్కోరు నమోదు కావడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయపడడం ఆ టీమ్‌ని ఇబ్బంది పెట్టింది.

మార్కస్ స్టోయినిస్ వేసిన రెండో ఓవర్‌లో ఆఖరి బంతికి ఫాఫ్ డుప్లిసిస్ కొట్టిన ఫోర్‌ని ఆపేందుకు ప్రయత్నించిన కెఎల్ రాహుల్, తొడ కండరాలు పట్టుకోవడంతో కిందపడిపోయాడు. లేచి నడవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు కెఎల్ రాహుల్...

దానికి ముందు మ్యాచ్ ఆరంభానికి ముందు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, అదుపు తప్పి పడిపోయాడు. అతని భుజాలు బలంగా నేలను తాకడంతో ఫిజియోతో కలిసి డగౌట్‌కి చేరుకున్నాడు జయ్‌దేవ్ ఉనద్కట్... ఈ ఇద్దరూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.

హర్మ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల వరకూ సమయం పడుతుంది. దీంతో కెఎల్ రాహుల్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడా? అనేది అనుమానంగా మారింది.