IPL 2023: 150 పరుగులకి పంజాబ్ కింగ్స్ ఆలౌట్... 4 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్! ఒంటరి పోరాటం చేసిన ప్రభుసిమ్రాన్, జితేశ్ శర్మ.. 

చెన్నైతో మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌ని ఓడించి కమ్‌బ్యాక్ ఇచ్చింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయలేకపోయినా మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ స్పెల్‌తో 4 వికెట్లు తీయడంతో పాటు ఓ మెరుపు రనౌట్ చేసి అదరగొట్టి... బెంగళూరుకి విజయం అందించాడు.. 175 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్ కింగ్స్, 18.2 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

ఏడాదిన్నర తర్వాత కెప్టెన్సీ చేసిన విరాట్ కోహ్లీ, విజయంతో రీఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్‌కి శుభారంభం దక్కలేదు. మొదటి బంతికి ఫోర్ బాదిన అథర్వ టైడ్, రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఓ సిక్సర్ బాది 8 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్, వానిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

2 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న ఆర్‌సీబీకి వికెట్ దక్కింది. 9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సిరాజ్ డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు..

కెప్టెన్ సామ్ కుర్రాన్ కూడా 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఓ ఎండ్‌లో వికెట్ పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును కదిలించిన ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్.. 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి పార్నెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్.. ఓ సిక్సర్ బాదిన షారుక్ ఖాన్, హసరంగ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్, జితేశ్ శర్మ కలిసి 8వ వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

13 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన హర్‌ప్రీత్ బ్రార్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ సిరాజ్, అదే ఓవర్‌లో నాథన్ ఎల్లీస్‌ని కూడా బౌల్డ్ చేశాడు.దీంతో 18 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్..

4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, ఐపీఎల్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసిన జితేశ్ శర్మ, ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగుల స్కోరు చేయగలిగింది. ఒకనాక 137/0 స్కోరుతో కనిపించిన ఆర్‌సీబీ, ఈజీగా 200+ స్కోరు చేస్తుందని అనుకున్నారు ఫ్యాన్స్. డెత్ ఓవర్లలో వరుస వికెట్లు తీసిన పంజాబ్ కింగ్స్ బౌలర్లు, ఆర్‌సీబీ స్కోరును కట్టడి చేశారు. 

ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి తొలి వికెట్‌కి 137 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేశ్ శర్మ పట్టిన సూపర్బ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2023 సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ బాది పెవిలియన్ చేరాడు..

ఆ తర్వాతి బంతికి వస్తూనే భారీ షాట్‌ ఆడేందుకు చూసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, అథర్వ టైడ్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండు వికెట్లు పడిన తర్వాత వేగం పెంచిన ఫాఫ్ డుప్లిసిస్, రెండు సిక్సర్లు బాదాడు...

56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో సామ్ కుర్రాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 137/0 స్కోరు ఉన్న ఆర్‌సీబీ, 8 బంతుల గ్యాప్‌లో 3 వికెట్లు కోల్పోయి 151/3 స్థితికి చేరుకుంది...

దినేశ్ కార్తీక్ కూడా ఎప్పటికే 5 బంతుల్లో ఓ ఫోర్ బాది 7 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ 9 బంతుల్లో 7, షాబజ్ అహ్మద్ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.