Asianet News TeluguAsianet News Telugu

గిల్‌కు ఆరెంజ్ క్యాప్.. అయితే గుజరాత్‌కు కప్పు గోవిందా..? అదే రిపీట్ అయితే టోపీ తప్ప ట్రోఫీ కష్టమే..!

IPL 2023 Playoffs: ఐపీఎల్-16 రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో  ఆ జట్టు ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. కానీ  ఇప్పుడు గుజరాత్ ఫ్యాన్స్‌కు ‘ఆరెంజ్ క్యాప్  సెంటిమెంట్’ బెంగ పట్టుకుంది. 

IPL 2023 Playoffs: Shubman Gill Won Orange Cap But Fans Concerns  about Gujarat Titans Fate in Finals MSV
Author
First Published May 27, 2023, 9:30 AM IST

ఐపీఎల్‌-16 లో భీకర ఫామ్‌తో ఇప్పటికే మూడు  సెంచరీలు చేసి దూకుడు మీదున్న శుభ్‌మన్ గిల్.. శుక్రవారం గుజరాత్ టైటాన్స్  - ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన  రెండో క్వాలిఫయర్‌లో కూడా తన  జోరు కొనసాగించాడు.  ఈ సెంచరీ ద్వారా  గిల్.. పలు రికార్డుల దుమ్ము దులపడంతో పాటు ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో  గిల్.. 16 మ్యాచ్ లలో  16 ఇన్నింగ్స్ ఆడి  60.79 సగటుతో ఏకంగా  851 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడికి చేరువగా ఉన్న ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు.  చెన్నై సూపర్ కింగ్స్  ఓపెనర్ డెవాన్ కాన్వే.. 625 పరుగులతో ఉన్నా అతడు ఆడేది ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే. ఒక్క మ్యాచ్ లో కాన్వే.. గిల్ రికార్డును బ్రేక్ చేయడం అసంభవం. 

అన్నీ భాగానే ఉన్నా గిల్‌కు ఆరెంజ్ క్యాప్ రావడమే గుజరాత్ ఫ్యాన్స్‌ను  ఆందోళనకు గురి చేస్తున్నది.  16 ఏండ్ల ఐపీఎల్ చరిత్రలో  ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్లు ఉన్న టీమ్ లు  రెండు సార్లు మాత్రమే  కప్ నెగ్గాయి. మిగతా  13 సార్లు ఆరెంజ్ క్యాప్ హీరోలకు  టోపీ తప్ప ట్రోఫీ  దక్కలేదు. 

ఆ ఇద్దరే.. 

ఐపీఎల్ చరిత్రలో  2014, 2021 ఏడాదులలో మాత్రమే  ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్ల టీమ్స్  ట్రోఫీ నెగ్గాయి.  2014లో రాబిన్ ఊతప్ప ఆరెంజ్ క్యాప్ దక్కించుకోగా ఆ ఏడాది  కోల్కతా నైట్ రైడర్స్  విజేతగా నిలిచింది.  2021లో కూడా  చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్..  ఆరెంజ్ క్యాప్ తో పాటు ఆ జట్టుకు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండేండ్లలో తప్ప 13 ఏండ్లలో ఆరెంజ్ క్యాప్.. ఐపీఎల్ ట్రోఫీ విజేతలు ఉన్న  జట్లకు దక్కలేదు. 

చరిత్ర ఇది.. 

1. 2008 - షాన్ మార్ష్  (పంజాబ్, 616 పరుగులు) - ట్రోఫీ విజేత  రాజస్తాన్ రాయల్స్ 
2. 2009 - మాథ్యూ హేడెన్ (చెన్నై, 572)  -   డెక్కన్ ఛార్జర్స్ 
3. 2010 - సచిన్ టెండూల్కర్ (ముంబై, 618) - చెన్నై సూపర్ కింగ్స్ 
4. 2011 - క్రిస్ గేల్ (ఆర్సీబీ, 608) -  చెన్నై సూపర్ కింగ్స్
5. 2012 - క్రిస్ గేల్ (ఆర్సీబీ, 733) - కోల్కతా నైట్ రైడర్స్ 
6. 2013 - మైఖేల్ హస్సీ (చెన్నై, 733) - ముంబై ఇండియన్స్
7. 2014 -  రాబిన్ ఊతప్ప (కోల్కతా, 660) - కోల్కతా నైట్ రైడర్స్ 
8. 2015 - డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ - 562)  - ముంబై ఇండియన్స్ 
9. 2016 - విరాట్ కోహ్లీ (ఆర్సీబీ, 973) - సన్ రైజర్స్ హైదరాబాద్ 
10. 2017 - డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్, 641) - ముంబై ఇండియన్స్ 
11. 2018 - కేన్ విలియమ్సన్ (సన్ రైజర్స్, 735) - చెన్నై సూపర్ కింగ్స్ 
12. 2019 - డేవిడ్ వార్నర్ - (సన్ రైజర్స్, 692) - ముంబై ఇండియన్స్ 
13. 2020 - కెఎల్ రాహుల్  - (పంజాబ్, 670) - ముంబై ఇండియన్స్ 
14. 2021 - రుతురాజ్ గైక్వాడ్ - (చెన్నై, 635) - చెన్నై సూపర్ కింగ్స్
15. జోస్ బట్లర్ - (రాజస్తాన్, 863) - గుజరాత్ టైటాన్స్ 
16. ఈ సీజన్ లో ప్రస్తుతానికైతే ఆరెంజ్ క్యాప్ రేసులో  గిల్... 851 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నా  మరి  ట్రోఫీ గెలిచేది  గుజరాత్ అవుతుందో లేదో చూడాలంటే  ఆదివారం రాత్రి వరకూ  వేచి చూడాల్సిందే...!

Follow Us:
Download App:
  • android
  • ios