Asianet News TeluguAsianet News Telugu

ఆంక్షల్లేవు.. అన్నీ ఆకాంక్షలే.. రేపట్నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం..

IPL 2023: మాయదారి మహమ్మారి కరోనా కారణంగా  మూడేండ్లు కళ కోల్పోయిన  క్యాష్ రిచ్ లీగ్.. మళ్లీ కళకళలాడేందుకు  సర్వాంగ సుందరంగ ముస్తాబైంది. దాదాపు పది ఫ్రాంచైజీలు ‘ఎట్లయితే గట్లాయే.. ఈసారి కప్ కొట్టాలే..’  అన్న పట్టుదలతో ఉన్నాయి. 

IPL 2023:  New Season, New Hopes, Here Is All You Need To Know About Indian Premier League MSV
Author
First Published Mar 30, 2023, 7:12 PM IST

ప్రపంచాన్ని సుమారు రెండేండ్ల పాటు అతలాకుతలం చేసిన మాయదారి మహమ్మారి కరోనా కారణంగా ‘కళ తప్పిన’ ఐపీఎల్ మళ్లీ కళకళలాడేందుకు  పరితపిస్తోంది.  2008లో ఈ లీగ్ మొదలైనప్పట్నుంచీ  2019 వరకూ ‘ఇంటా బయటా’ (హోం అండ్ అవే)  గేమ్‌లతో  దేశ ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా  క్రికెట్ అభిమానులను అలరించిన  అతి పెద్ద క్రికెట్ లీగ్..  కరోనా కారణంగా కళ తప్పింది. గడిచిన మూడేండ్ల పాటు ‘ఆంక్షల వలయం’(బయో బబుల్)లో  చిక్కి  స్డేడియాలు వెలవెలబోయి.. టీఆర్పీ రేటింగులు రాక ఒకింత నిరాశకు లోనైన ఐపీఎల్.. ఈ సీజన్ నుంచి  ‘ఆకాంక్షల పరుగు’ను అందుకోవడానికి సర్వాంగ సుందరంగ ముస్తాబైంది.  

ఇప్పటివరకు  టోర్నీలో ఒక్కసారి కూడా విజేతగా నిలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ లు ఒక్కసారైనా టైటిల్ విజేతగా గెలవాలని.., గత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో  అట్టడుగు స్థానాన నిలిచిన ముంబై, చెన్నైలు  పునర్ వైభవం అందుకోవాలని..  మరోసారి విజేతగా నిలవాలని రాజస్తాన్, సన్ రైజర్స్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను కాపాడుకోవాలని గుజరాత్.. రెండో ప్రయత్నంలో అయినా కప్ కొట్టాలని  లక్నో... అందరిదీ ఒకటే ఆకాంక్ష.. ‘ఎట్లయితే గట్లాయే.. ఈసారి కప్ కొట్టాలే..’ 

భగభగమండే వేసవిలో  క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించడానికి  ఐపీఎల్ ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి.  సుమారు నెలన్నర ముందునుంచే పది ఫ్రాంచైజీలు  ప్రాక్టీస్ సెషన్స్, ట్రైనింగ్ క్యాంప్స్ పేరిట ఆటగాళ్లను మెగా సమరానికి సమాయత్తం చేశాయి.  శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే  చెన్నై సూపర్ కింగ్స్ -  గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7.30 గంటలకు ఆరంభమయ్యే మ్యాచ్ తో  సీజన్ మొదలవుతుంది.  ఈ మేరకు  బీసీసీఐ ఇదివరకే షెడ్యూల్ ను ప్రకటించింది. 

పది ఫ్రాంచైజీలు.. 74  మ్యాచ్‌లు.. కావాల్సినంత వినోదం.. 

రేపట్నుంచి మొదలుకాబోయే  ఐపీఎల్ లో పది ఫ్రాంచైజీలు లీగ్ దశలో  70 మ్యాచ్ లు ఆడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాలు ఈ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్నాయి.  లీగ్ దశ పోటీలు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ - 4లో ఉన్న జట్లు  ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి.  ప్లేఆఫ్స్ లో నాలుగు మ్యాచ్ లు (మొత్తం 74) ఉంటాయి. మొత్తంగా  మార్చి 31 నుంచి మొదలయ్యే ఈ సీజన్.. మే  28న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.  ప్లేఆఫ్స్, ఫైనల్స్ కు ఇంకా వేదికలు ప్రకటించలేదు.  

 

వేదికలు ఇవే.. 

- హోం అండ్ అవే విధానంలో తిరిగి మ్యాచ్ లు జరుగుతుండగా  ఫ్రాంచైజీలు స్వంత అభిమానుల మధ్య మ్యాచ్ లు ఆడనున్నాయి.  ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు ఉన్న గుజరాత్  (అహ్మదాబాద్), ముంబై  (ముంబై),  ఆర్సీబీ (బెంగళూరు),  సన్ రైజర్స్ హైదరాబాద్ (హైదరాబాద్), పంజాబ్ (మొహాలి), లక్నో సూపర్ జెయింట్స్ (లక్నో), కేకేఆర్ (కోల్కతా), చెన్నై సూపర్ కింగ్స్ (చెన్నై),  రాజస్తాన్ రాయల్స్ (జైపూర్), ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ)  తమ హోంగ్రౌండ్ లో ఆడనున్నాయి.  రాజస్తాన్ జట్టు జైపూర్ తో పాటు గువహటి (అసోం) లో, పంజాబ్ మొహాలితో పాటు  ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్) లో  కూడా మ్యాచ్ లు ఆడనుంది. 

ఆరంభ వేడుకలు అదిరేలా.. 

ఐపీఎల్ - 16 లో ఆరంభ వేడుకలు సాయంత్రం  6 గంటలకు మొదలవుతాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన  నరేంద్ర మోడీ  (మొతేరా) స్టేడియంలో జరుగబోయే ఈ వేడుకల్లో  బాలీవుడ్ తో పాటు  దక్షిణాది తారలు కూడా మెరువనున్నారు.  బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తో పాటు సౌత్ బ్యూటీస్ రష్మిక మందన్న, తమన్నాలు తమ డాన్స్ తో అలరించనున్నారు. వీరితో పాటు టైగర్ ష్రాఫ్ కూడా మొతేరాను మోతిక్కించేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ  గాయకుడు అరిజిత్ సింగ్ తన గానా బజానాతో  ముంచెత్తనున్నాడు. 

ఐపీఎల్ మ్యాచ్ లు చూడటమెలా.. 

ఈ లీగ్ లో మ్యాచ్ లను టెలివిజన్ లో వీక్షించాలంటే ఐపీఎల్ కు అధికారిక  ప్రసారదారు (టెలివిజన్) గా ఉన్న  స్టార్  నెట్వర్క్ (తెలుగులో ‘స్టార్  మా’) ఛానెల్స్ లో  చూడొచ్చు.    

 

ఆప్‌లో ఇలా.. 

మొబైల్ ఫోన్లలో  వీటిని చూడాలనుకుంటే ఐపీఎల్ డిజిటల్ మీడియా పార్ట్నర్ గా ఉన్న జియో  సినిమాలో  వీక్షించొచ్చు. జియో సినిమాస్ తో పాటు  వూట్ యాప్ లో  కూడా  లైవ్ చూడొచ్చు.   

Follow Us:
Download App:
  • android
  • ios