IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్   డిజిటల్ రైట్స్ దక్కించుకున్న  వయాకామ్ (జియో)   ప్రేక్షకులకు అత్యుత్తమ  సర్వీసును అందించడంలో విఫలమైంది. 

వచ్చే ఐదేండ్ల కాలానికి ఐపీఎల్ లో డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ముఖేశ్ అంబానీకి చెందిన వయాకామ్ 18 (జియో) ఈ సీజన్ లో తమ సర్వీసులను అందించడంలో విఫలమైందా..? అంటే మొబైల్ యూజర్లు మాత్రం ఔననే అంటున్నారు. ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సర్వీసులను కాస్తో కూస్తో బెటర్ గానే అందించిన జియో.. ఐపీఎల్ తొలి రోజు ఆరంభ వేడుకలు, మ్యాచ్ ను ప్రసారం చేయడంలో పలు అంతరాయాలను ఎదుర్కుంది. యాప్ లో పదే పదే ఎర్రర్స్ కనిపించాయి. ప్రతీ ఐదు, పది నిమిషాలకు ఒకసారి సర్వర్ ఎర్రర్ అని రావడం ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. 

గతేడాది మేలో ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో భాగంగా 2023-27 కాలానికి గాను డిజిటల్ హక్కులను జియో రూ. 23,578 కోట్లకు దక్కించుకుంది. టెలివిజన్ హక్కులను డిస్నీ స్టార్.. రూ. 23,575 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో (2018-2023) టీవీ, డిజిటల్ రెండూ డిస్నీ స్టార్ కే దక్కగా ఈసారి మాత్రం డిజిటల్ ప్రసారాలు జియో చేతికి వెళ్లాయి. 

ఐపీఎల్ ప్రారంభానికి ముందు జియో.. ఈ సీజన్ నుంచి ఐపీఎల్ ప్రేక్షకులకు గతంలో కంటే మించిన అనుభూతిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందని.. 4 కె రెజెల్యూషన్ క్వాలిటీ, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కలిగేలా ప్రసారాలను అందించనుందని ఊదరగొట్టింది. ఈ కొత్త ప్రసారాలను చూడాలంటే కనీసం మొబైల్ లో 2 నుంచి 3 జీబీ డేటా కావాలని వార్తలు వచ్చాయి. దీంతో ప్రతీరోజూ 1 జీబీ డేటా మాత్రమే వచ్చే కస్టమర్లు.. ‘ఓరి దేవుడా.. ఇలా అయితే మా గతేంగాను. మేము ఇక ఐపీఎల్ సగం కూడా చూడలేమా..?’అని తెగ ఫీలయిపోయారు. 

Scroll to load tweet…

కానీ నిన్న జియో ప్రసారాలు చూస్తే మాత్రం ‘పైన పటారం లోన లొటారం’అన్నట్టుగా ఉంది. ఓపెనింగ్ సెర్మనీ నుంచే జియో ‘తిరుగుడు’ స్టార్ట్ అయింది. ప్రతీ ఐదు, పది నిమిషాయలకు యాప్ క్రాష్ అయి ‘సర్వర్ ఎర్రర్’ అని రావడం, ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా నిత్యం బఫర్ అవడంతో వినియోగదారులు మండిపడ్డారు.

ఒకవైపు సీఎస్కే - జీటీ మ్యాచ్ జరుగుతుండగానే ట్విటర్ లో #Jiocrash ట్రెండింగ్ అయింది. జియో బాధితులు ఈ హ్యాష్ ట్యాగ్ పై తమ వెతలను పోస్ట్ చేస్తూ గోడు వెల్లబోసుకున్నారు. ఈ ‘తిరుగుడు’కు తోడు జియోలో ఇంగ్లీష్ కామెంట్రీ చెప్పిన వ్యాఖ్యతల ఓవరాక్షన్ కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. గ్రేమ్ స్వాన్, క్రిస్ గేల్, ఏబి డివిలియర్స్, రాబిన్ ఊతప్పలు మ్యాచ్ గురించి విశ్లేషించినదానికంటే ‘నా జోక్ కు నువ్వు నవ్వు.. నీ జోక్ కు నేను నవ్వుతా’ అన్నట్టుగా ‘మమ’అనిపించారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

Scroll to load tweet…

అయితే మరికొందరు మాత్రం జియోకు ఇంత లోడ్ కొత్త అని, డిస్నీ హాట్ స్టార్ కూడా గత ఐపీఎల్ లో పలుమార్లు క్రాష్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనిపై జియో సినిమా యాప్ కూడా క్లారిటీ ఇచ్చింది. వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్న మాట వాస్తవమే గానీ.. దీనిని పరిష్కరించడానికి తమ బృందం పనిచేస్తుందని, త్వరలోనే అంతరాయం లేని ప్రసారాలను అందజేస్తామని వివరణ ఇచ్చింది. 

Scroll to load tweet…