Asianet News TeluguAsianet News Telugu

ధోని కంట కన్నీరు.. జడ్డూను ఎత్తుకుని మనసారా ఏడ్చిన చెన్నై సారథి..

IPL 2023 Final: తన కెరీర్‌లో ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని.. నిన్న గుజరాత్ టైటాన్స్ పై గెలవగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 

IPL 2023: MS Dhoni Lifts Ravindra Jadeja After IPL 2023 Final Win With Teary Eyes, Video Went Viral In Social Media MSV
Author
First Published May 30, 2023, 1:43 PM IST

మిన్ను విరిగి మీద పడ్డా లైట్ తీసుకుంటాడు.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ కూడా   ప్రశాంతంగా ఉంటూ  పనికానిచ్చే  వ్యక్తిత్వం..  గెలిచినా ఓడినా ముఖంలో ఒకేరకమైన ఎక్స్‌ప్రెషన్.. అలాంటి మహేంద్ర సింగ్ ధోని కంట కన్నీరు. ఇదెవరూ ఊహించనిది.  దేశానికి  వన్డే  ప్రపంచకప్ ను అందించినప్పుడు కూడా.. కూల్ గా ఉన్న ధోని..  మొదటిసారి  ఒక మ్యాచ్ తర్వాత  భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. కెరీర్ లో చివరి మ్యాచ్ (?) అని భావిస్తున్న  వేళ.. జడేజా చెన్నైని గెలిపించిన వేళ ధోని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 

వర్షం కారణంగా 15 ఓవర్లలో  171 పరుగుల లక్ష్యం  ఛేదించే క్రమంలో   ఆఖరి ఓవర్లో  13 పరుగులు చేయాల్సి ఉండగా మోహిత్ శర్మ..  మొదటి నాలుగు బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు. అప్పుడు స్టేడియం అంతా నిశ్శబ్దం. క్రీజులో  రవీంద్ర జడేజా.. డగౌట్ లో ధోని.. కెమెరాలు  ధోనినే క్యాప్చర్ చేస్తున్నాయి. 

మోహిత్ శర్మ ఐదో బాల్ వేశాడు. లాంగాన్ మీదుగా భారీ సిక్సర్. అప్పుడు మొదలైంది అసలైన ఉత్కంఠ. చివరి బంతికి జడ్డూ ఫోర్ కొడతాడా..? కొట్టడా..? అందరి ముఖాల్లోనూ ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.  ధోని కళ్లు మూసుకున్నాడు. మోహిత్ లాస్ట్ బాల్ వేశాడు.   ఫైన్ లెగ్ దిశగా బంతి బౌండరీకి వెళ్లడానికి ముందే  చెన్నై  ఆటగాళ్లు ఆనందంతో  గ్రౌండ్ లోకి పరిగెత్తారు. కానీ డగౌట్ లో ఉన్న ధోని.. ఆనందంతో ఎగిరిగంతేయలేదు.  ధోని కంట కన్నీరు. కానీ అది కూడా  కనబడనీయలేదు ధోని.  బ్యాటింగ్ కోచ్  మైక్ హస్సీ వచ్చి ధోనిని అభినందిస్తున్నాడు. 

 

అదే సమయంలో  విజయానందంలో ఉన్న జడ్డూ.. ధోని వైపునకు వచ్చాడు.  అప్పుడు  చూడాలి ధోనిని. పట్టరాని సంతోషంతో  జడ్డూను అమాంతం  రెండు చేతులతో ఎత్తుకుని  మనసారా హత్తుకున్నాడు. ఆ సమయంలో ధోని కళ్లు చెమర్చాయి. జడేజా కూడా ధోనిని మనస్ఫూర్తిగా హగ్ చేసుకుని  ఒకరినొకరు  శుభాకాంక్షలు చెప్పుకున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  జడ్డూను హగ్ చేసుకున్న తర్వాత  అతడిని దింపిన  ధోని.. మిగిలిన ఆటగాళ్లను అభినందిస్తూ  అందరితోనూ  మాట్లాడుతూ గడిపాడు.  అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత  కూడా ధోని.. రాత్రి 3 గంటలకు నరేంద్ర మోడీ స్టేడియం చుట్టూ  అభిమానులకు అభివాదం చేయడం గమనార్హం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios