Asianet News TeluguAsianet News Telugu

IPL 2023: లక్నో జెయింట్స్ సూపర్ విక్టరీ... భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు...

IPL 2023: డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ వృథా.. 5 వికెట్లు తీసిన మార్క్ వుడ్.. లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో 50 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్..

IPL 2023: lucknow Super giants beats Delhi Capitals in high scoring game, home ground matches cra
Author
First Published Apr 1, 2023, 11:25 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన తొలి మూడు మ్యాచుల్లో సొంత మైదానాల్లో ఆడిన టీమ్స్ విజయాలు అందుకున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలవగా, మొహాలీలో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) గెలిచింది. మూడో మ్యాచ్‌లో హోం గ్రౌండ్‌లో లక్నో టీమ్ బోణీ కొట్టింది... 194 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమై 50 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 


భారీ లక్ష్యఛేదనని దూకుడుగా మొదలెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. 4.2 ఓవర్లలో 41 పరుగులు చేసిన ఢిల్లీకి మార్క్ వుడ్ తొలి షాక్ ఇచ్చాడు. 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన పృథ్వీ షాని క్లీన్ బౌల్డ్ చేసిన మార్క్ వుడ్, ఆ తర్వాతి బంతికే మిచెల్ మార్ష్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు...

9 బంతులాడిన సర్ఫారాజ్ ఖాన్ ఓ ఫోర్ బాది, మార్క్ వుడ్ బౌలింగ్‌లో వినూత్న షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన రిలే రసో, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రిలే రసో, థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించడానికి ముందే నడుచుకుంటూ పెవిలియన్‌కి వెళ్లిపోయాడు..

రోవ్‌మన్ పావెల్ 1, ఆమన్ ఖాన్ 4 పరుగులు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్, మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. 48 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేసిన కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వార్నర్ అవుట్ అయ్యే సమయానికి ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 81 పరుగులు కావాలి.. అప్పటికే ఢిల్లీ ఓటమి దాదాపు ఖరారైపోయింది..

17వ ఓవర్‌లో 4 పరుగులే రాగా 18వ ఓవర్‌లో ఓ 4, 6 బాదిన అక్షర్ పటేల్.. అదే ఊపును కొనసాగించలేకపోయాడు. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 55  పరుగులు కావాల్సి వచ్చాయి. 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన అక్షర్ పటేల్, ఆఖరి ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. మొదటి బంతికి ఫోర్ బాదిన చేతన్ సకారియా ఆఖరి ఓవర్ ఐదో బంతికి అవుట్ కాగా చివరి బంతికి పరుగులేమీ రాలేదు. మార్క్ వుడ్ 5 వికెట్లు తీసి, 2023 సీజన్‌లో ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు.


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది..  12 బంతుల్లో 8 పరుగులు చేసిన రాహుల్, చేతన్ సకారియా బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సకారియా బౌలింగ్‌లో రాహుల్ అవుట్ కావడం ఇది మూడోసారి...

19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్. 6 ఓవర్లు ముగిసే సరికి 30 పరుగులే చేసిన లక్నో, ఆ తర్వాత కైల్ మేయర్స్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది.  కైల్ మేయర్స్‌తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దీపక్ హుడా 18 బంతుల్లో 17 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు చేసిన కైల్ మేయర్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన నికోలస్ పూరన్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో పృథ్వీ షాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  

7 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 18 పరుగులు చేసిన ఆయుష్ బదోనీ, ఇన్నింగ్స్ ముగియడానికి ఒక్క బంతి ముందు అవుట్ అయ్యాడు. కృనాల్ పాండ్యా 13 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి కృష్ణప్ప గౌతమ్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి తీసుకొచ్చింది లక్నో. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన కృష్ణప్ప గౌతమ్, లక్నో స్కోరుని 193కి చేర్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios