IPL 2023: ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ముగిసిన మ్యాచ్ లో నోబాల్ వివాదంతో కాసేపు మ్యాచ్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది.
క్రికెట్ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయమే ఫైనల్. తప్పైనా ఒప్పైనా వాళ్ల నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అంపైర్స్ మీద అరిచినా, ఏదైనా సంజ్ఞలతో వారిని దూషించినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నాడు. అంపైర్‌కు మిడిల్ ఫింగర్ చూపిస్తూ హద్దులు మీరాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఏం జరిగింది..?
హైదరాబాద్ - లక్నో మధ్య కొద్దిసేపటిక్రితమే ముగిసిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో అవేశ్ ఖాన్ 19వ ఓవర్ బౌలింగ్ చేశాడు. మూడో బాల్ హైఫుల్ టాస్ గా వేశాడు. ఈ బాల్ ను ఆన్ ఫీల్డ్ అంపైర్ నోబాల్ గా ప్రకటించగా లక్నో రివ్యూకు వెళ్లింది.
రివ్యూలో థర్డ్ అంపైర్ టీవీ రిప్లేలో బంతి స్పష్టంగా నడుము పైభాగంగలో వికెట్ల మీదుగా వెళ్లినా దానిని నో బాల్ గా కాకుండా కరెక్ట్ బాల్ గానే కౌంట్ చేశాడు. దీంతో సన్ రైజర్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తో పాటు సమద్ లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. థర్డ్ అంపైర్ లక్నోకు అనుకూలంగా వ్యవహరించారని లక్నో డగౌట్ వద్దకు వాటర్ బాటిల్స్, బోల్టులు, తమ వద్ద ఉన్న ఇతర వస్తువులను విసిరారు. గంభీర్, ఆండీ ఫ్లవర్, విజయ్ దహియాతో పాటు లక్నో ఆటగాళ్లంతా అక్కడ్నుంచి బయటకు వెళ్లగానే వారిని చూస్తూ ‘కోహ్లీ కోహ్లీ’ అని బిగ్గరగా అరిచారు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.
అంపైర్ల రంగ ప్రవేశం.. అండీ ఫ్లవర్ ఆగ్రహం..
హైదరాబాద్ ఫ్యాన్స్ లక్నో డగౌట్ మీదకు బోల్టులు విసరడంతో అంపైర్లు రంగ ప్రవేశం చేసి వారిని వారించారు. అప్పుడే అక్కడే ఉన్న లక్నో హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ కు ‘మధ్య వేలు’ చూపిస్తూ అసహనం వ్యక్తం చేసినట్టు వీడియోలను చూస్తే తెలుస్తున్నది. అయితే ట్విటర్ లో కొంతమంది మాత్రం..ఆండీ ఫ్లవర్ తమకు హైదరాబాద్ అభిమానులు మిడిల్ ఫింగర్ కూడా చూపించారని అంపైర్ కు వివరించినట్టు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
