IPL 2023 సీజన్‌లో మొదటిసారి స్కోరు దాటిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. హారీ బ్రూక్ సెన్సేషనల్ సెంచరీ, అయిడిన్ మార్క్‌రమ్ హాఫ్ సెంచరీ..
ఐపీఎల్ 2023 వేలంలో రూ.13.25 కోట్ల భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన హారీ బ్రూక్, ఎట్టకేలకు అద్భుత ఇన్నింగ్స్‌తో తన మీద వస్తున్న ట్రోల్స్‌కి సెంచరీతో సమాధానం చెప్పాడు. హారీ బ్రూక్ సెన్సేషనల్ సెంచరీతో పాటు కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 228 పరుగుల భారీ స్కోరు చేసింది.. గుజరాత్ టైటాన్స్‌పై 205 పరుగుల భారీ టార్గెట్ ఛేదించిన కేకేఆర్‌కి ఈ టార్గెట్ సరిపోతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది..
ఉమేశ్ యాదవ్ వేసిన మొదటి ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన హారీ బ్రూక్, మూడో ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 3 ఓవర్లు ముగిసే సమయానికే 43 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే సునీల్ నరైన్ వేసిన నాలుగో ఓవర్‌లో కేవలం 3 పరుగులే వచ్చాయి.
ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలిసారి బౌలింగ్‌కి వచ్చిన ఆండ్రే రస్సెల్, తొలి బంతికే మయాంక్ అగర్వాల్‌ని అవుట్ చేశాడు. 13 బంతుల్లో 9 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అదే ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన రాహుల్ త్రిపాఠి, 9 పరుగులు చేసి ఆఖరి బంతికి వికెట్ కీపర్ గుర్భాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన ఆండ్రే రస్సెల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు వేగాన్ని దెబ్బ తీశాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 8,9 ఓవర్లలో బౌండరీ రాలేదు...
సుయాశ్ శర్మ బౌలింగ్‌లో 6, 6, 4 బాదిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 4, 6 బాది అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, హారీ బ్రూక్‌తో కలిసి మూడో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు..
వస్తూనే అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ని శార్దూల్ ఠాకూర్ జారవిడిచాడు. లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో మొదటి బంతికే సిక్సర్ బాదిన హారీ బ్రూక్, ఆ తర్వాతి బంతికి అంపైర్ అవుట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకుని బతికిపోయాడు. అదే ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 0, 4 బాదిన హారీ బ్రూక్.. 23 పరుగులు రాబట్టాడు..
ఆ తర్వాతి ఓవర్‌లో హారీ బ్రూక్ ఓ ఫోర్, అభిషేక్ శర్మ 2 ఫోర్లు బాదడంతో ఆర్‌సీబీపై సంచలన బౌలింగ్ చేసిన సుయాశ్ శర్మ, 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి 3 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చిన సునీల్ నరైన్, తన ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 14 పరుగులు రావడంతో 2 ఓవర్లు మిగిలి ఉండగానే 200 మార్కు దాటేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..
17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసిన ఆండ్రే రస్సెల్, తొడ కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్‌ని శార్దూల్ ఠాకూర్ ముగించాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్‌లో మొట్టమొదటి సెంచరీ అందుకున్నాడు హారీ బ్రూక్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇదే మొదటి సెంచరీ.
6 బంతులు ఫేస్ చేసిన హెన్రీచ్ క్లాసిన్ 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
