IPL 2023: సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదిన హార్ధిక్ పాండ్యా... 47 పరుగులు చేసి అవుటైన వృద్ధిమాన్ సాహా! శుబ్‌మన్ గిల్ డకౌట్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడో వారంలో జరుగుతున్న మ్యాచులు, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జిడ్డు బ్యాటింగ్ బోరింగ్ మ్యాచ్ మరిచిపోకముందే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది. బౌలింగ్‌కి సహకరిస్తున్న పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది.
నవీన్ వుల్ హక్ వేసిన తొలి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే రాగా రెండో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చిన కృనాల్ పాండ్యా, బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని డకౌట్ చేశాడు.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, రవి భిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది గుజరాత్ టైటాన్స్.
రెండో ఓవర్‌లో ఒక్క సింగిల్ మాత్రమే వచ్చింది. వన్ డౌన్‌లో వచ్చిన హార్ధిక్ పాండ్యా కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో స్కోరు వేగం బాగా మందగించింది..
రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా 2 ఫోర్లు బాదడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. రెండో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం జోడించిన వృద్ధిమాన్ సాహా, 37 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లోనే దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
5 బంతుల్లో 3 పరుగులు చేసిన అభినవ్ మనోహార్, సాహా అవుటైన తర్వాతి ఓవర్‌లోనే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో నవీన్ వుల్ హక్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు అభినవ్ మనోహార్... వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్...
12 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన విజయ్ శంకర్, నవీన్ వుల్ హక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నవీన్ వుల్ హక్2కి ఇది మొట్టమొదటి ఐపీఎల్ వికెట్. ఓ వైపు ఓవర్లు ముగుస్తున్నా స్కోరు మాత్రం ఎక్కడా వేగం పుంజుకోలేదు...
భారీ గ్రౌండ్‌లో రిస్క్ చేసి షాట్స్ ఆడేందుకు హార్ధిక్ పాండ్యా కానీ, డేవిడ్ మిల్లర్ కానీ ఇష్టపడలేదు. దీంతో డెత్ ఓవర్లలో కూడా సింగిల్స్, డబుల్స్ మాత్రమే వచ్చాయి. 16వ ఓవర్‌లో, 17వ ఓవర్‌లో 5 పరుగులే రాబట్టగలిగారు ఈ వరల్డ్ క్లాస్ హిట్టర్స్...
రవి భిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదిన హార్ధిక్ పాండ్యా.. హాఫ్ సెంచరీ అందుకోవడమే కాకుండా గుజరాత్ టైటాన్స్ స్కోరును 120 మార్కు దాటించాడు... గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ వరకూ ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం.
నవీన్ వుల్ హక్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. మార్కస్ స్టోయినిస్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాదిన హార్ధిక్ పాండ్యా, 55 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసి కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 12 బంతులు ఆడి 6 పరుగులు చేసి ఆఖరి బంతికి అవుట్ కాగా రాహుల్ తెవాటియా 2 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
