IPL 2023 DC vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. మిచెల్ మార్ష్‌కి గాయం! గాయం నుంచి కోలుకున్న ఖలీల్ అహ్మద్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

8 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని టేబుల్ టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడుతుండడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఓడితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా ఆవిరి అవుతాయి.

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముట్టుకున్నదల్లా దరిద్రంగా మారి, వరుస పరాజయాలను అందిస్తుంటే.. గుజరాత్ టైటాన్స్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఢిల్లీ ఎన్నో ఆశలు పెట్టుకున్న పృథ్వీ షాతో పాటు సర్ఫరాజ్ ఖాన్, రిలే రసో, మనీశ్ పాండే ఘోరంగా విఫలం అవుతున్నారు. 

డేవిడ్ వార్నర్ ఆరంభంలో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడినా గత రెండు మూడు మ్యాచులుగా అది లేదు. గత మ్యాచ్‌లో ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్ ఆకట్టుకున్నారు. అయితే లేక లేక ఫామ్‌లోకి వచ్చిన మిచెల్ మార్ష్ గాయం కారణంగా నేటి మ్యాచ్‌కి దూరమయ్యాడు. అతని స్థానంలో రిలే రసోకి తుది జట్టులో చోటు దక్కింది...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న ఢిల్లీ బౌలర్లు, ఢిల్లీలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 197 పరుగుల భారీ స్కోరు అప్పగించారు..


మరోవైపు గుజరాత్ టైటాన్స్, వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోతోంది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నాడు. అలాగే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటు నుంచి కూడా సరిగ్గా పరుగులు రావడం లేదు..

అయితే మిడిల్ ఆర్డర్‌లో అభినవ్ మనోహార్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నారు..

టాప్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించగలిగితే ప్లేఆఫ్స్ రేసు కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారిపోతుంది. టైటాన్స్ చేతుల్లో ఢిల్లీ చిత్తుగా ఓడితే, మిగిలిన ఐదు మ్యాచుల్లో ఒక్కటి లేదా 2 మ్యాచులు గెలిచినా వేరే టీమ్స్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కి దూసుకుపోతోంది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్..

జైత్ర యాత్ర కొనసాగిస్తున్న గుజరాత్ టైటాన్స్ నేటి మ్యాచ్‌లో కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. వృద్దిమాన్ సాహా స్థానంలో శ్రీకర్ భరత్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందని టాక్ వినబడినా విజయాలు అందుకున్న టీమ్‌ కాంబినేషన్‌ని కొనసాగించేందుకే మొగ్గు చూపాడు హార్ధిక్ పాండ్యా..

గుజరాత్ టైటాన్స్ జట్టు ఇది: వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహార్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోషువా లిటిల్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది: డేవిడ్ వార్నర్, ఫిలిప్ సాల్ట్, మనీశ్ పాండే, రిలే రసో, ప్రియం గార్గ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, ఆమన్ హకీం ఖాన్, కుల్దీప్ యాదవ్, అన్రీచ్ నోకియా, ఇషాంత్ శర్మ