పంజాబ్ కింగ్స్‌కు కొంచెం తీపి.. కొంచెం చేదు.. అతడి రాకకు అడ్డుకట్ట వేసిన ఈసీబీ
IPL 2023: త్వరలో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 16 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు లోగిళ్లలో ఘనంగా జరిగిన ఉగాదికి తయారుచేసే పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితం కూడా ఈ ఆరు రుచుల మిశ్రమమే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ఉగాది పచ్చడి రుచి చూపించింది. కొంచెం తీపి, కొంచెం చేద రుచులను పరిచయం చేసింది. తీపి బాగుందని సంతోషించేలోపే చేదును కూడా భరించాలని చెప్పింది. అదేంటి.. ఉగాదిని పంజాబ్, ఇంగ్లాండ్ లలో కూడా జరుపుకుంటారా..? అనుకుంటున్నారా..? లేదు. వచ్చే ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ కు ఆడబోయే ఇంగ్లాండ్ క్రికెటర్ల విషయంలో ఆ జట్టుకు ఈసీబీ ఓ శుభ, మరో చేదు వార్త అందించింది.
ఈసీబీ.. పంజాబ్ కు అందించిన తీపి రుచి ఏంటంటే.. గతేడాది పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ రాబోయే సీజన్ లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. రావల్పిండి వేదికగా పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టులో లివింగ్‌స్టోన్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో గాయం కారణంగా ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.
కానీ ఇటీవలే అతడు లాంక్‌షైర్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఈసీబీ నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో కూడా నెగ్గాడు. దీంతో అతడు ఐపీఎల్ ఆడేందుకు ఈసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022 ఐపీఎల్ వేలంలో లివింగ్‌స్టోన్ ను పంజాబ్.. రూ. 11.50 కోట్లకు దక్కించుకుంది.
చేదు వార్త ఏంటంటే.. గత వేలంలో పంజాబ్ రూ. 6.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన జానీ బెయిర్ స్టో మాత్రం ఈ సీజన్ లో ఆడేందుకు ఈసీబీ అనుమతి తెలపలేదు. గతేడాది ఆగస్టులో బెయిర్ స్టో కాలికి గాయమైంది. దీని నుంచి అతడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఐపీఎల్ ఆడేందుకు బైరెడ్డి (సన్ రైజర్స్ అభిమానులు ముద్దుగా పిలుచుకున్న పేరు) సిద్ధంగానే ఉన్నా ఈసీబీ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఇంగ్లాండ్ టెస్టు టీమ్ లో కీలక సభ్యుడైన బెయిర్ స్టోను ఈ ఏడాది జూన్ నుంచి స్వదేశంలో జరుగబోయే యాషెస్ టెస్టు సిరీస్ కోసం ఫిట్నెస్ సాధించాలని ఈసీబీ అతడిని ఆదేశించినట్టు సమాచారం. దీంతో బైరెడ్డి ఐపీఎల్ లో ఆడేది అనుమానమే.
కరన్‌కూ ఓకే..
లివింగ్‌స్టోన్, బెయిర్ స్టో ల సంగతి పక్కనబెడితే ఈసీబీ.. మరో శుభవార్త కూడా అందజేసింది. గత డిసెంబర్ లో ముగిసిన ఐపీఎల్ వేలంలో పంజాబ్.. రూ. 18.50 కోట్లతో దక్కించుకున్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ను ఆడించేందుకు అనుమతి తెలిపింది. అతడికి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) అందజేసింది. బెయిర్ స్టో విషయంలో పంజాబ్ కు కాస్త చేదు రుచే అయినా లివింగ్‌స్టోన్, కరన్ లు ఎన్వోసీలు దక్కించుకోవడం ఆ జట్టుకు పెద్ద ఊరటే..
ఈ ముగ్గురితో పాటు ఈసీబీ.. జోఫ్రా ఆర్చర్ (ముంబై) బెన్ స్టోక్స్ (సీఎస్కే), మార్క్ వుడ్ (లక్నో) లకూ ఐపీఎల్ లో ఆడేందుకు అంగీకారం తెలిపింది.
ఐపీఎల్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు :
సామ్ కరన్ (పంజాబ్), లివింగ్‌స్టోన్ (పంజాబ్), బెన్ స్టోక్స్ (చెన్నై), హ్యారీ బ్రూక్ (సన్ రైజర్స్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ), రీస్ టాప్లే (ఆర్సీబీ), అదిల్ రషీద్ (సన్ రైజర్స్), జో రూట్ (రాజస్తాన్), మోయిన్ అలీ (చెన్నై), జోఫ్రా ఆర్చర్ (ముంబై), జోస్ బట్లర్ (రాజస్తాన్), డేవిడ్ విల్లే (ఆర్సీబీ), మార్క్ వుడ్ (లక్నో)