IPL 2023: ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ ధవల్ కులకర్ణి  చేసిన ఓ పని  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తన కళ్లముందే  ఓ అమ్మాయి కిందపడ్డా లేపకండా..

పక్కింట్లో మంటలు చెలరేగి అది కాలిబూడిదవుతుంటే అక్కడ ఫోటోలు దిగుతూ.. లైవ్ వీడియోలు స్టార్ట్ చేసి ‘ఐయామ్ విత్ ఫైర్’ అని క్యాప్షన్లు పెట్టుకునే కాలంలో బతుకుతున్నాం మనం. మన కళ్ల ముందే మనం చేయగలిగే సాయం చేయాల్సి ఉన్న చేయలేని, చేతకాని స్థితికి సమాజం దిగజారిపోయిందన్నా ఆశ్చర్యమే లేదు. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ విషయంలో తక్కువేమీ తినలేదు. తాజాగా ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ ధవల్ కులకర్ణి కూడా ఇదే రకమైన ఓ పనితో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. 

గతంలో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన ఈ వెటరన్ బౌలర్.. ఇటీవలే ఓ హోటల్ లో డిన్నర్ కు వెళ్తూ ఫోటోలకు ఫోజిచ్చాడు. సరే కాస్తో కూస్తో సెలబ్రిటీ హోదా ఉంది.. ఫొటోలకు ఫోజులివ్వడంలో తప్పులేదనే అనుకుందాం.. 

కానీ ఫోజులివ్వడానికి క్షణ కాలం ముందే అతడి ముందు ఓ యువతి ఫోన్ లో నడుచుకుంటూ వస్తూ అదుపుతప్పి కింద పడిపోయింది. అది సాక్షాత్తూ కులకర్ణి కళ్ల ముందే జరిగింది. ఆమె పడిపోయిన దూరం కూడా కులకర్ణికి నాలుగు అడుగులే. అయినా కులకర్ణి మాత్రం పడిపోయిన ఆమెకు సాయం చేయడానికి వెళ్లలేదు. వెళ్లలేదు సరికదా.. ఆమె పడిపోయిన తర్వాతే ఫోటోగ్రాఫర్ వైపునకు మళ్లి క్లోజప్ యాడ్ లో ఇకిలించినట్టు పళ్లు ఇకిలించి ఫోటోలకు ఫోజులిచ్చాడు. 

View post on Instagram

ఈ వీడియోను ‘ఇన్‌స్టాంట్ బాలీవుడ్’ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కులకర్ణిని ఆటాడుకుంటున్నారు. సెలబ్రిటీ స్టేటస్ రాగానే సరిపోదని, దానిని నిలబెట్టుకునే మనసు కూడా ఉండాలని దుమ్మెత్తిపోస్తున్నారు. ‘నువ్వు ఫేమస్ అవడం వల్ల ఏం లాభం. కనీసం నీ ముందు పడిపోయిన ఓ మనిషిని పైకి లేపాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు నీకు..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా 2008 నుంచి ఐపీఎల్ ఆడిన కులకర్ణి.. రాజస్తాన్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. మొత్తంగా ఐపీఎల్ లో 92 మ్యాచ్ లు ఆడి 86 వికెట్లు తీసిన కులకర్ణి.. భారత జట్టు తరఫున 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. 12 వన్డేలలో 19, 2 టీ20లలో 3 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో 2019 తర్వాత కులకర్ణికి అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత అతడు కామెంటేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.


Scroll to load tweet…