సారాంశం
IPL 2023: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో టైటిల్‌ను గెలుచుకుంది. మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఐపీఎల్-16 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.
నాలుగు గంటల్లో ముగియాల్సిన మ్యాచ్ కోసం మూడు రోజుల పాటు వేచి చూసినా ఎక్కడా ఇసుమంతైన ఆసక్తి తగ్గలేదు. నట్ట నడిరాత్రి.. సబర్మతి నదీ తీరాన.. దేశమంతా గాఢ నిద్రలో ఉండి క్రికెట్ అభిమానులు మాత్రం జాగారం చేస్తున్న వేళ.. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతం చేసింది. ‘అమ్మో.. 215 టార్గెట్.. అసలు గెలవగలరా..?’ అన్న స్థితి నుంచి ‘గెలిచాం..’ అంటూ చెన్నై ఫ్యాన్స్‌ను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఆఖరి బంతి థ్రిల్లర్‌లో జడ్డూ చేసిన మాయకు చెన్నై తన ఖాతాలో ఐదో ట్రోఫీని అందుకుంది.
ఐపీఎల్-16 ఫైనల్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. సాయి సుదర్శన్ (96) వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని చెన్నై.. ఆఖరి బంతికి ఛేదించి ఐపీఎల్-16కు ఘనమైన ముగింపును ఇచ్చింది. వరుసగా రెండో టైటిల్ కొట్టాలన్న గుజరాత్ టైటాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత అవార్డుల కార్యక్రమం కూడా కన్నుల పండువగా జరిగింది. ట్రోఫీతో పాటు సీజన్ మొత్తం అలరించిన ఆటగాళ్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శనలు చేసినవారికి పలు అవార్డులు దక్కాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం..
అవార్డులు - నగదు బహుమతి లిస్ట్ :
- ఐపీఎల్-16 కు గాను ప్లేఆఫ్స్ చేరిన నాలుగు జట్లకు బీసీసీఐ పంచిన మొత్తం నగదు విలువ రూ. 46 కోట్ల 50 లక్షలు
- విజేత (చెన్నై సూపర్ కింగ్స్)కు రూ. 20 కోట్లు
- రన్నరప్ (గుజరాత్ టైటాన్స్) కు రూ. 13 కోట్లు
- మూడో స్థానం (ముంబై ఇండియన్స్)లో నిలిచిన జట్టుకు రూ. 7 కోట్లు
- ఫోర్త్ ప్లేస్ (లక్నో సూపర్ జెయింట్స్) టీమ్‌కు రూ. 6 కోట్ల 50 లక్షలు
వ్యక్తిగత అవార్డులు :
1. అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్) : శుభ్‌మన్ గిల్ (890 పరుగులు), రూ. 15 లక్షలు
2. అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్) : మహ్మద్ షమీ (28 వికెట్లు), రూ. 15 లక్షలు
3. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : గిల్, రూ. 10 లక్షలు
4. గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ : గిల్ రూ. 10 లక్షలు
5. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ : గ్లెన్ మ్యాక్స్‌వెల్, రూ. 10 లక్షలు
6. క్యాచ్ ఆఫ్ ది సీజన్ : రషీద్ ఖాన్, రూ. 10 లక్షలు
7. మోస్ట్ ఫోర్స్ : గిల్ (రూ. 10 లక్షలు)
8. లాంగెస్ట్ సిక్సర్ ఆఫ్ ది సీజన్ : ఫాఫ్ డుప్లెసిస్ (రూ. 10 లక్షలు)
9. ఫెయిర్ ప్లే అవార్డు : ఢిల్లీ క్యాపిటల్స్
10. బెస్ట్ పిచ్, గ్రౌండ్ ఆఫ్ ది సీజన్ : ఈడెన్ గార్డెన్స్ (కోల్కతా), వాంఖెడే (ముంబై).. రూ. 50 లక్షలు