Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 Final CSK vs GT: అహ్మదాబాద్‌లో వడగండ్ల వర్షం... ఫైనల్‌ సజావుగా సాగకపోతే..

జోరువానకి తడిసి ముద్దయిన నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం... నేడు వీలుకాకపోతే ఫైనల్ కోసం రేపు రిజర్వు డే... అది కూడా వీలుకాకపోతే సంయుక్త విజేతలుగా సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్.. 

IPL 2023 Final CSK vs GT: heavy rain in Ahmedabad, over cutoff, Reserve day details CRA
Author
First Published May 28, 2023, 7:23 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌‌కి వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ ప్రారంభ సమయానికి ముందు అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. వానకి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం తడిసి ముద్దయ్యింది. స్టేడియంలో అధునాతన డ్రైనేజీ స్టిసమ్ ఉండడంతో వర్షం ఆగితే అరగంటలో పిచ్ ఆటకు సిద్ధం అవుతుంది..

ఈ రోజు రాత్రి 10 గంటల 10 నిమిషాల లోపు మ్యాచ్ ప్రారంభమైతే పూర్తి ఓవర్ల పాటు ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వర్షం తగ్గి మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్లను కుదిస్తారు.  అర్ధరాత్రి 11 గంటల 56 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైతే చెరో 5 ఓవర్ల పాటు మ్యాచ్‌ని నిర్వహిస్తారు.

వర్షం కారణంగా నేడు ఆట వీలుకాకపోతే రిజర్వు డేగా రేపు ఫైనల్ మ్యాచ్‌ని నిర్వహిస్తారని వార్తలు వచ్చినా ఫైనల్‌కి రిజర్వు డే లేదని ప్రకటించారు నిర్వహాకులు. దీంతో ఈరోజు  మ్యాచ్ సజావుగా పూర్తి కాకపోతే కనీసం సూపర్ ఓవర్‌లో ఫైనల్ విజేతని తేలుస్తారు..

అదీ వీలుకాకపోతే రేపు రిజర్వు డేలో ఫైనల్ జరుగుతుంది. రేపు కూడా జోరు వానతో మ్యాచ్ నిర్వహించడం వీలు కాకపోతే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. 

ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 9 సార్లు టైటిల్ గెలవగా, ఛేదించిన జట్లకు 6 సార్లు టైటిల్ దక్కింది. టాస్ గెలిచిన జట్లకు 9 సార్లు విజయం దక్కగా, 6 సీజన్లలో టాస్ ఓడిన జట్లకు టైటిల్ దక్కింది. 

ఇది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడికి ఆఖరి ఐపీఎల్ మ్యాచ్. అనధికారికంగా సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి ఇంకా స్పష్టమైన క్లారిటీ కానీ ప్రకటన కానీ రాలేదు. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇంతకుముందు మూడు మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించింది. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య మొహాలీలో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా అంతరాయం కలగగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పంజాబ్ గెలిచింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లక్నోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది..

ఈ మ్యాచ్ రద్దు కావడంతో వచ్చిన పాయింట్‌తో లక్నో సూపర్ జెయింట్స్ లక్కీగా ప్లేఆఫ్స్‌కి వచ్చింది. ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఆరంభానికి ముందు కూడా జోరువాన కురిసింది. అయితే మ్యాచ్ సమయానికి వాన ఆగిపోవడంతో పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ సాగింది.. 

Follow Us:
Download App:
  • android
  • ios