Asianet News TeluguAsianet News Telugu

రైల్వేస్టేషన్‌లో నిద్ర.. మ్యాచ్ చూసేదాకా ఇంటికెళ్లే సవాలే లేదు.. చెన్నై ఫ్యాన్స్ డెడికేషన్ అంటే అట్లుంటది మరి!

IPL 2023 Final: ఐపీఎల్-16 ఫైనల్  మ్యాచ్ చూడటానికి  చెన్నై నుంచి తండోపతండాలుగా  అహ్మదాబాద్ వచ్చిన ధోని అభిమానులపై వరుణుడు  షాకిచ్చాడు. 

IPL 2023 Final CSK vs GT: CSK and MSD Fans  Sleep at Railway Station, Video Went Viral MSV
Author
First Published May 29, 2023, 4:51 PM IST

ఐపీఎల్-16 లో భాగంగా  చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య  ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన  ఫైనల్ పోరు వర్షం కారణంగా  నేటికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.  ఆదివారం టాస్‌కు ముందే  మొదలైన వాన.. రాత్రి 11 గంటలు దాటినా  తగ్గలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నేటికి వాయిదా వేశారు. అయితే   ఆదివారం   మ్యాచ్ కోసం అర్థరాత్రి దాకా వేచి చూసిన అభిమానులు.. నిరాశగా   అక్కడ్నుంచి వెళ్లిపోయినా  చెన్నై ఫ్యాన్స్ మాత్రం రిటర్న్ రైలు ఎక్కి  చెన్నైకి రాలేదు. అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ తో పాటు స్థానికంగా ఉన్న స్టేషన్లలోనే ప్లాట్ ఫామ్ ల మీద పడుకున్నారు. 

చాలా మంది చెన్నై అభిమానులు.. రైల్వే ఫ్లాట్‌ఫామ్ ల మీద పడుకున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  సాధారణంగా మ్యాచ్ రద్దైతే  చాలామంది అభిమానులు  టీవీలలో చూసుకుందాంలే అనుకుని  రిటర్న్ వెళ్లిపోతారు.

అభిమానులు ఇలా వెళ్లిపోవడానికి చాలా కారణాలుంటాయి.   వేరే ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు.. సాధారణంగా  ముందే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుని ఉంటారు.   వాటిని క్యాన్సిల్ చేసుకోవడం.. వేరే  ట్రైన్స్ కు మళ్లీ టికెట్ బుక్ చేసుకోవడం పెద్ద తంటా. నిన్న రాత్రి మ్యాచ్ ను వాయిదా వేశాక జియో సినిమాతో  భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా ఫ్యాన్స్ గురించి ఆందోళన చెందుతూ  ఇవే వ్యాఖ్యలు చేశాడు. కానీ చెన్నై అభిమానులు మాత్రం  ఏదైతే అది అయింది.. ధోని సేన ఆటను  చూసేగానీ ఇంటికి వెళ్లేది లేదని మంగమ్మ శపథంతో అహ్మదాబాద్ కు వచ్చి ఉంటారు. ఫైనల్ లో ధోని సేన కప్ అందుకోవడాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు  గాను రాత్రంతా  రైల్వే స్టేషన్ లలోనే  నిద్రించారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

 

కాగా ఫైనల్‌కు రిజర్వ్ డే ఉండటంతో  నేడు  అదే అహ్మదాబాద్ వేదికగా  రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.   అయితే  వర్షం ముప్పు నిన్నటితోనే ముగిసిపోలేదు. వాతావారణ శాఖ అంచనా   ప్రకారం  సోమవారం  రాత్రి 9 తర్వాత ఇక్కడ వర్షం పడే అవకాశాలు  మెండుగా ఉన్నాయని  సూచిస్తున్నాయి. నిన్నటంత కాకపోయినా వర్షం కురవడం అయితే పక్కా అని నివేదికలు సూచిస్తున్నాయి. 

నేడు 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని భావిస్తున్న బీసీసీఐకి, అభిమానులకు ఇది  కాస్త  బ్యాడ్ న్యూసే. కానీ  మ్యాచ్ సజావుగా సాగేందుకు  అనువైన ఏర్పాట్లన్నీ చేసిన బీసీసీఐ.. 20 ఓవర్ల ఆట కుదరకుంటే 15, 10తో పాటు 5 ఓవర్ల మ్యాచ్ ద్వారా అయినా ఫలితం తేల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  అదీకాకుంటే   చివరి ప్రయత్నంగా  ‘సూపర్ ఓవర్’ ద్వారా అయినా ఫలితం నిర్ణయించే అవకాశాలున్నాయి.  కానీ వరుణుడు మాత్రం  నిన్నట్లాగే అసలు  ఒక్క బంతి కూడా  వేయడానికి ఛాన్స్ ఇవ్వకుంటే ఏంటన్న అనుమానాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి.   దీనికి బీసీసీఐ అధికారుల నుంచి  వస్తున్న సమాధానం ఏంటంటే.. పాయింట్ల పట్టికలో టాప్-1లో ఉన్న జట్టును  విజేతగా ప్రకటించడం. ఈ లెక్కన చూస్తే  డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్-16 ట్రోఫీ అవుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios