IPL 2023 Final: టాస్ గెలిచిన ఎమ్మెస్ ధోనీ... గుజరాత్ టైటాన్స్‌కి అనుకూలంగా రికార్డులు..
IPL 2023 Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ఫైనల్ మ్యాచ్‌లో మార్పులు లేకుండా బరిలో దిగుతున్న ఇరు జట్లు..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది..
షెడ్యూల్ ప్రకారం మే 28న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్, వర్షం కారణంగా నేటికి వాయిదా పడింది. సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇది 11వ ఫైనల్ మ్యాచ్. సురేష్ రైనా 8 సార్లు ఫైనల్ ఆడితే, రవిచంద్రన్ అశ్విన్, డిజే బ్రావో, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు ఏడేసి సార్లు ఫైనల్ ఆడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు..
గుజరాత్ టైటాన్స్‌పై రుతురాజ్ గైక్వాడ్‌కి అదిరిపోయే రికార్డు ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ 50+ స్కోర్లు నమోదు చేశాడు రుతురాజ్ గైక్వాడ్. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచుల్లో 53, 73 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు...
మొదటి క్వాలిఫైయర్‌లో 44 బంతుల్లో 60 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, నేటి మ్యాచ్‌లో మరోసారి బ్యాటు ఝులిపించడం సీఎస్‌కేకి చాలా అవసరం. సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇది 250వ ఐపీఎల్ మ్యాచ్. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన మొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు ధోనీ..
249 మ్యాచుల్లో 39.09 యావరేజ్‌తో 5082 పరుగులు చేసిన ధోనీ, 24 హాఫ్ సెంచరీలు, 349 ఫోర్లు, 239 సిక్సర్లు, 137 క్యాచులు అందుకున్నాడు. 2018లో మే 27న ఫైనల్ ఆడి టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, అంతకుముందు 2011లో మే 28న ఫైనల్ ఆడి టైటిల్ సాధించింది. దీంతో మే 29న కూడా టైటిల్ గెలిస్తే వరుసగా మూడు రోజుల్లో టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా నిలుస్తుంది చెన్నై సూపర్ కింగ్స్...
ఐపీఎల్ ఫైనల్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 9 సార్లు విజయం సాధించగా లక్ష్యఛేదన చేసిన జట్లకు 6 సార్లు విజయాలు దక్కాయి. టాస్ గెలిచిన జట్లు 9 సార్లు టైటిల్ గెలిస్తే, ఓడిన జట్లు 6 సార్లు ఛాంపియన్లుగా అవతరించాయి..
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కలిపి 203 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అంబటి రాయుడికి ఇది ఆఖరి ఐపీఎల్ మ్యాచ్. గత సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించి, 15 నిమిషాలకే ఆ ట్వీట్ డిలీట్ చేసిన అంబటి రాయుడు, ఈసారి తన నిర్ణయం మారదని స్పష్టం చేశాడు...
గుజరాత్ టైటాన్స్ జట్టు ఇది: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, అజింకా రహానే, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహార్, మతీశ్ పథిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ