Asianet News TeluguAsianet News Telugu

తుత్తర ఆపుకోని ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు... సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు ఈజీ టార్గెట్...

IPL 2023: ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్.. భువనేశ్వర్ కుమార్‌కి 2 వికెట్లు... 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన మనీశ్ పాండే..

IPL 2023: Delhi Capitals failed to score huge total, Washinton sundar picks 3 wickets CRA
Author
First Published Apr 24, 2023, 9:15 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి ప్లేస్‌ వేరే టీమ్‌కి ఇవ్వకుండా గట్టిగా కష్టపడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్‌. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలించే ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఏకంగా ముగ్గురు రనౌట్ అయ్యారు.

పృథ్వీ షాని పక్కనబెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్, ఫిలిప్ సాల్ట్‌ని ఓపెనర్‌గా పంపింది. భువీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసిన్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు ఫిలిప్ సాల్ట్. ఐపీఎల్‌లో అత్యధిక మందిని డకౌట్ చేసిన బౌలర్‌గా రెండో స్థానంలో నిలిచాడు భువీ. లసిత్ మలింగ 36 సార్లు బ్యాటర్లను డకౌట్ చేయగా బ్రావో 24 డకౌట్ల రికార్డును అధిగమించిన భువనేశ్వర్ కుమార్ 25 మందిని సున్నాకే పెవిలియన్ చేర్చాడు..

1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్‌లో 4 ఫోర్లు బాది 19 పరుగులు రాబట్టాడు మిచెల్ మార్ష్. అయితే ఆ తర్వాత భువీ ఓవర్‌లో సింగిల్ మాత్రమే వచ్చింది. రెండో వికెట్‌కి 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత నట్టూ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు..

15 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఫలితం దక్కింది. 

వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్. 290 పరుగుల తర్వాత తొలి సిక్సర్ బాదిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్ చరిత్రలో సీజన్‌లో ఒక్క సిక్సర్ బాదకుండా ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా 14.4 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఏకంగా 3 వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు సుందర్...

20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్, అదే ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్, ఆమన్ హకీం ఖాన్ వికెట్లను తీశాడు.  9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, సుందర్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

వస్తూనే ఫోర్ బాదిన ఆమన్ హకీం ఖాన్, ఆ తర్వాతి బంతిని కూడా గాల్లోకి లేపి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 ఓవర్లు పూర్తయిన తర్వాత 57/2 వద్ద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, వాషింగ్టన్ సుందర్ ఓవర్ తర్వాత 62/5 స్థితికి చేరుకుంది...

ఈ దశలో మనీశ్ పాండే, అక్షర్ పటేల్ కలిసి ఆరో వికెట్‌కి 59 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 34 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన అక్షర్ పటేల్‌ని భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు..

27 బంతుల్లో 2 ఫోర్లతో 34 పరుగులు చేసిన మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్ సూపర్ త్రోకి రనౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌ రెండో బంతికి ఆన్రీచ్ నోకియా కూడా రనౌట్ కాగా నాలుగో బంతికి రిపల్ పటేల్ కూడా రనౌట్ అయ్యాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios