IPL 2023: 131 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 125 పరుగులకే పరిమితమైన గుజరాత్ టైటాన్స్... హార్ధిక్ పాండ్యా అజేయ హాఫ్ సెంచరీ వృథా... రాహుల్ తెవాటియా హ్యాట్రిక్ సిక్సర్లు బాదినా.. 

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జైత్ర యాత్రకి ఆఖరి పొజిషన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేకులు వేసింది. 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కొట్టకుండా గుజరాత్ టైటాన్స్‌ని నిలువరించి 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులే చేయగలిగింది.


టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కి 131 పరుగుల ఈజీ టార్గెట్‌ని ఛేదనలో ఊహించని షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్‌లో 6 బంతులు ఎదుర్కొన్న వృద్ధిమాన్ సాహా, ఒక్క పరుగు కూడా చేయకుండా ఫిలిప్ సాల్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, నోకియా బౌలింగ్‌లో మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన విజయ్ శంకర్‌ని ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 బంతులాడిన పరుగులేమీ చేయలేకపోయిన డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్‌ని కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహార్ కలిసి ఆదుకున్నారు. ఐదో వికెట్‌కి 63 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అభినవ్ మనోహార్ 33 బంతుల్లో ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆమన్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

గుజరాత్ టైటాన్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 33 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆన్రీచ్ నోకియా వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు బాదిన రాహుల్ తెవాటియా, మ్యాచ్‌ని మలుపు తిప్పాడు.

దీంతో ఆఖరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 12 పరుగులే కావాల్సి వచ్చాయి. మొదటి బంతికి 2 పరుగులు రాగా రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి రాహుల్ తెవాటియాని అవుట్ చేశాడు ఇషాంత్ శర్మ. 7 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా, రిలే రసోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

చివరి 2 బంతుల్లో టైటాన్స్ విజయానికి 9 పరుగులు కావాల్సి వచ్చాయి. రషీద్ ఖాన్ రాగానే 2 పరుగులు తీయడంతో చివరి బంతికి 7 పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి బంతికి రషీద్ ఖాన్ సింగిల్ తీయడంతో ఢిల్లీకి 5 పరుగుల తేడాతో విజయం దక్కింది. 53 బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నాటౌట్‌గా నిలిచాడు. త

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగుల స్కోరు చేయగలిగింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇన్నింగ్స్ మొదటి బంతికే షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్, డేవిడ్ మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 

2 బంతుల్లో 2 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రనౌట్ అయ్యాడు. 6 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన రిలే రసో, మహ్మద్ షమీ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 1 పరుగు చేసిన మనీశ్ పాండే కూడా షమీ బౌలింగ్‌లో సాహాకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

14 బంతుల్లో 10 పరుగులు చేసిన ప్రియమ్ గార్గ్ కూడా షమీ బౌలింగ్‌లో సాహాకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, గుజరాత్ టైటాన్స్ తరుపున ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 

23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ని అక్షర్ పటేల్, ఆమన్ హకీం ఖాన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన అక్షర్ పటేల్, 30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

73 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఏడో వికెట్‌కి రిపల్ పటేల్, ఆమన్ హకీం ఖాన్ కలిసి 26 బంతుల్లో 53 పరుగులు జోడించారు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదిన ఆమన్ హాకీం ఖాన్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

ఐదో వికెట్ పడిన తర్వాత ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో రెండు 50 భాగస్వామ్యాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. మోహిత్ శర్మకు ఇది ఐపీఎల్‌ కెరీర్‌లో 100వ వికెట్.