సారాంశం
IPL 2023, DC vs PBKS: ఐపీఎల్ - 16 లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ సెంచరీతో రెచ్చిపోయాడు. కీలక ఆటగాళ్లు విఫలమైన చోట సూపర్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ను ఆదుకున్నాడు.
ఐపీఎల్ -16 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక రాణించాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మళ్లీ విఫలమయ్యారు. ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ సెంచరీతో ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ధావన్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మలు విఫలమైన చోట 22 ఏండ్ల ప్రభ్‌సిమ్రన్.. ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నాడు. 61 బంతుల్లో సెంచరీ చేసిన అతడు.. మొత్తంగా 65 బంతులు ఆడి 10 బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ శతకంతో పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగుల చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా అతడు సూపర్ ఇన్నింగ్స్ తో పంజాబ్ కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కు ఈ మ్యాచ్ లో కూడా ఆశించిన ఆరంభం దక్కలేదు. సీజన్ ఆరంభంలో ధాటిగా ఆడిన శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో 7 పరుగులే చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో రూసోకు క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్ లోవచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ (4) కూడా ఇషాంత్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ సీజన్ లో పంజాబ్ తరఫున నిలకడగా ఆడుతున్న జితేశ్ శర్మ (5) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఓపెనర్ గా వచ్చిన ప్రభ్‌సిమ్రన్ సింగ్.. సామ్ కరన్ (24 బంతుల్లో 20, 1 ఫోర్) కలిసి పంజాబ్ ను ఆదుకున్నాడు.
ప్రభ్‌సిమ్రన్ సెంచరీ..
45 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో ప్రభ్‌సిమ్రన్ జట్టును ఆదుకున్నాడు. మిచెల్ మార్ష్ వేసిన 11వ ఓవర్లో 6, 4, 4తో అర్థ సెంచరీకి చేరువయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్లో మూడో బాల్ సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ప్రవీణ్ దూబే వేసిన 15వ ఓవర్లో సామ్ కరన్ నిష్క్రమించినా ప్రభ్‌సిమ్రన్ జోరు తగ్గలేదు.
ఇషాంత్ శర్మ వేసిన 16వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. కుల్దీప్ వేసిన 17వ ఓవర్లో 6,6 కొట్టి 90లలోకి చేరాడు. ఇక ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాది 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో అతడికి ఇదే ఫస్ట్ సెంచరీ కావడం గమనార్హం. అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన వారిలో ప్రభ్‌సిమ్రన్.. సంజూ శాంసన్ తర్వాత నిలిచాడు. ప్రభ్‌సిమ్రన్ వయసు 22 ఏండ్ల 276 రోజులు. సెంచరీ చేసే క్రమంలో మొదటి 31 బంతుల్లో 27 పరుగులు చేసిన అతడు.. తర్వాత 34 బంతుల్లో ఏకంగా 76 పరుగులు రాబట్టడం విశేషం.
సెంచరీ తర్వాత ముకేశ్ కుమార్ వేసిన 19వ ఓవర్లో రెండో బాల్ కు ప్రభ్‌సిమ్రన్ ను బౌల్డ్ చేశాడు. పంజాబ్ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా అక్షర్, కుల్దీప్, ముకేశ్, ప్రవీణ్ దూబే లు తలా ఓ వికెట్ తీశారు.