IPL 2023: ఐపీఎల్ - 16లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్  నేడు  కోల్‌కతా నైట్ రైడర్స్ తో  కీలక మ్యాచ్ లో  తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ జరిగేది అనుమానంగానే  ఉంది.  

ఐపీఎల్ లో అపజయాల పరంపరకు బ్రేక్ వేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు అవకాశం వస్తుందేమో అనుకుంటే వరుణ దేవుడు దానిని కూడా బ్రేకులు వేశాడు. నేడు అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఆ జట్టు తలపడనుండగా వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరిగేది అనుమానంగానే ఉంది. ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. నడి వేసవిలో ఢిల్లీలో వర్షం కురుస్తుండంటం గమనార్హం. టాస్ వేసేముందు కాస్త తెరిపినిచ్చిన వర్షం.. మళ్లీ ముంచుకురావడంతో ఆటగాళ్లు నిరాశగా డగౌట్ లోనే ఉన్నారు. 

ఈ సీజన్ లో ఢిల్లీకి ఏదీ కలిసిరావడం లేదు. ఆడిన ఐదు మ్యాచ్ లలో ఆ జట్టు ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. సొంత గ్రౌండ్ లో గుజరాత్, ముంబైల చేతులలో ఓడిన కేకేఆర్ పై అయినా గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తున్నది.

మరో వైపు కేకేఆర్ కూడా ఆడిన ఐదు మ్యాచ్ లలో రెండింటిలోనే గెలిచి మూడు మ్యాచ్ లు ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని కేకేఆర్ కోరుకుంటున్నది. 

ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ఒక్కడే రాణిస్తున్నాడు. పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యశ్ ధుల్ లు దారుణంగా విఫలమవుతున్నారు. నేటి మ్యాచ్ లో వీళ్లు రాణించడం ఢిల్లీకి అత్యావశ్యకం. బౌలింగ్ లో స్టార్ పేసర్ ఆన్రిచ్ నోర్జే వంటి బౌలర్ కూడా పేలవ ప్రదర్శనతో విఫలమవుతున్నాడు. ముస్తాఫిజుర్ కూడా గాడిన పడలేదు. స్పిన్నర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ప్రభావం చూపడం లేదు.

Scroll to load tweet…

ఇక కోల్కతా విషయానికొస్తే.. ఆ జట్టు ఓపెనర్ గుర్బాజ్, జగదీశన్ లు ఇప్పటివరకూ తమ మార్క్ చూపించలేదు. వెంకటేశ్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉండటం కేకేఆర్ కు కలిసొచ్చేదే. కెప్టెన్ నితీశ్ రాణా కూడా టచ్ లోనే ఉన్నాడు. అతడితో పాటు రింకూ సింగ్, ఆండ్రూ రసెల్, శార్దూల్ ఠాకూర్ లు మెరుపులు మెరిపిస్తే ఢిల్లీకి తిప్పలు తప్పవు. బౌలింగ్ లో ఆ జట్టు లాకీ ఫెర్గూసన్ డెత్ ఓవర్లలో విఫలమవుతున్నాడు. ఉమేశ్ యాదవ్ కూడా భారీగా పరుగులిస్తున్నాడు. యువ స్పిన్నర్ సుయాశ్ శర్మతో పాటు నరైన్, వరుణ్ చక్రవర్తి లు స్పిన్ భారాన్ని మోస్తున్నారు.